సీఐఐ సమ్మిట్‌కు భారీ భద్రత
మహారాణిపేట: ఈ నెల 14, 15 తేదీలలో నగరంలో జరగనున్న అంతర్జాతీయ స్థాయి సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై విశాఖ రేంజ్ డీఐజీ, ఇన్‌చార్జ్ సీపీ గోపినాథ్ జెట్టి సోమవారం పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. నగర ప్రవేశ మార్గాల వద్ద వాహనాల తనిఖీలను ముమ్మరం చేయాలని, అనకాపల్లి, విజయనగరం జిల్లాల నుంచి నగరంలోకి వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలని డీఐజీ స్పష్టం చేశారు. అసాంఘిక వ్యక్తులు, అనధికారిక లేదా ప్రమాదకరమైన వస్తువులు సమ్మిట్ వేదికలకు చేరకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ప్రతినిధులు బస చేసే అన్ని ప్రదేశాలలో సమగ్ర భద్రత, కీలక ప్రదేశాలలో యాంటీ–సబోటేజ్ తనిఖీలు చేపట్టాలని సూచించారు. సమ్మిట్ ప్రవేశ, నిష్క్రమణలను నియంత్రించడానికి యాక్సెస్ కంట్రోల్ చర్యలు అమలు చేయాలని, అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ప్రాంతాలను తనిఖీ చేసి, ప్రమాద నివారణ చర్యగా ఎలాంటి సీఎన్‌జీ లేదా ఎలక్ట్రిక్ వాహనాలను అక్కడ అనుమతించకూడదని ఆదేశించారు. సదస్సుకు వచ్చే ప్రతినిధులను విమానాశ్రయం నుంచి వసతి ప్రదేశాలకు, సమావేశ వేదికలకు సురక్షితంగా ప్రయాణించేలా చూడాలన్నారు. ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ వారికి అవసరమైన భద్రతా స్థాయిని తెలుసుకోవాలని, కార్యక్రమ భద్రతను పర్యవేక్షించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసు నిఘా ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం పాటించాలని తెలిపారు. నగరమంతా బహిరంగ పెట్రోలింగ్, నిఘా పటిష్టంగా ఏర్పాటు చేయాలని, సమ్మిట్ జరిగే జోన్లలో ఏరియా డామినేషన్ కోసం ప్రత్యేక బృందాలను మోహరించాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులపై గట్టి నిఘా ఉంచి, సీఐఐ సమ్మిట్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా, సురక్షితంగా జరిగేలా చూడాలని గోపీనాథ్ జెట్టి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీపీలు మణికంఠ చందోలు, మేరీ ప్రశాంతి సహా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విశాఖ రేంజ్ డీఐజీ, ఇన్‌చార్జ్ సీపీ గోపీనాథ్ జెట్టి


