భాగస్వామ్య సదస్సుకు పక్కా ఏర్పాట్లు
మహారాణిపేట: ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లన్నీ బుధవారం సాయంత్రం నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడు తూ ఉపరాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు పాల్గొననున్న ఈ సదస్సు కోసం పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యమంత్రి 12వ తేదీ రాత్రికి చేరుకుంటారని, 13న సీఐఐ, అధికారులతో సమావేశం అవుతారని తెలిపారు. సదస్సు కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని, డెలిగేట్ కిట్‌లను రిజిస్ట్రేషన్ సమయంలోనే అందించాలని సూచించారు. స్పాట్ రిజిస్ట్రేషన్ ఉండదని స్పష్టం చేశారు. వీఐపీ పార్కింగ్, నిరంతర విద్యుత్, ఇంటర్నెట్ వసతి, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, అతిథులకు సాంస్కృతిక ప్రదర్శనలతో స్వాగతం పలకాలని ఆదేశించారు. 12వ తేదీ సాయంత్రం నాటికి అన్ని విభాగాల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసి, డ్రై రన్ నిర్వహించుకోవాలని సూచించారు. రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషన్ కేతన్ గార్గ్, డీసీపీలు మణికంఠ చందోలు, మేరీ ప్రశాంతి, డిప్యూటీ కలెక్టర్లు సత్తిబాబు, లతామాధురి, వెంకటరత్నం, వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, సీఐఐ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
కలెక్టర్ హరేందిర ప్రసాద్


