తొలి రోజు ఆంధ్రాదే పైచేయి
విశాఖ స్పోర్ట్స్: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ ఎలైట్ ఏ గ్రూప్‌లో భాగంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆంధ్ర, తమిళనాడు జట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్ శనివారం ప్రారంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు జట్టు 74.3 ఓవర్లలో 182 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. తమిళనాడు తొలి ఇన్నింగ్స్ ఆరంభం అత్యంత పేలవంగా సాగింది. ఓపెనర్లు విమల్(10), నారా యణ్ (19)ను 29 పరుగులకే కోల్పోయింది. ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం(4), ప్రదోష్ రంజన్ (8)తో పాటు సిద్ధార్థ్ డకౌట్‌గా వెనుతిరగడంతో.. జట్టు కేవలం 46 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో సోను (26)తో కలిసి బాబా ఇంద్రజిత్ (19) ఇన్నింగ్స్‌ను 81 పరుగుల వరకు చేర్చగలిగారు. కెప్టెన్ సాయికిశోర్ (8) సైతం తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరడంతో.. టీ విరామ సమయానికి తమిళనాడు కేవలం 103 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. అయితే, చివరి వికెట్‌కు విద్యుత్ (40), సందీప్ (29 నాటౌట్) కలిసి ఏకంగా 79 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడం విశేషం. ఇది తమిళనాడు ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. వీరి పోరాటంతో తమిళనాడు జట్టు 182 పరుగుల స్కోర్‌ను సాధించగలిగింది. ఆంధ్ర బౌలర్లలో పృథ్వీరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, సౌరభ్ రెండు వికెట్లు, సాయితేజ, రాజు, అశ్విన్ తలో వికెట్ దక్కించుకున్నారు. చివరి వికెట్ ను తీసేందుకు రషీద్‌తో సైతం బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. ప్రతిగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్ అభిషేక్ (3) వికెట్‌ను కోల్పోయి 20 పరుగులు చేసింది. క్రీజ్‌లో భరత్ (12), విజయ్(1) ఉన్నారు.


