రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు 24 మంది ఎంపిక
భీమునిపట్నం: రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేశారు. భీమిలి సమీపంలోని కీర్తిన్‌పేటలో ఉన్న సన్ స్కూల్ ప్రాంగణంలో శనివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఎంపిక ప్రక్రియ జరిగింది. 14 నుంచి 17 సంవత్సరాల వయసు గల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 120 మంది బాలబాలికలు ఈ ఎంపికల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రకాల యోగాసనాలను ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఎంఈవో శివరాణి ప్రారంభించగా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతినిధులు టి.నాగేశ్వరరావు, సిహెచ్.వెంకటరావు మాట్లాడారు. అద్భుతమైన ప్రతిభను కనబరిచిన 24 మంది విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు వెల్లడించారు. వీరు ఈ నెల 23, 24 తేదీల్లో బాపట్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యే విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.20 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందిస్తామని సన్ స్కూల్ కరస్పాండెంట్ కైతపల్లి శ్రీనివాసరావు ప్రకటించారు. కార్యక్రమంలో యోగా ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


