ఎంవీవీ గ్రీన్‌ఫీల్డ్ గేటెడ్ భవన్‌లో అగ్నిప్రమాదం
కొమ్మాది: జీవీఎంసీ 8వ వార్డు ఎండాడలో గల ఎంవీవీ గ్రీన్ ఫీల్డ్ గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సెకండ్ ఫ్లోర్ బ్లాక్–ఎ, ఫ్లాట్ నెంబర్ 1201లో సుమారు రాత్రి 9 గంటల సమయంలో పొగ వ్యాపించి, మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఇంటి యజమాని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇదిలా ఉండగా పొగ దట్టంగా వ్యాపించడంతో ఇక్కడ నివాసితులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. మహిళలు, పిల్లలు ముఖ్యంగా వృద్ధులు మెట్ల మార్గంలో కిందికి దిగలేక అగచాట్లు పడ్డారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో లిఫ్ట్ కూడా పనిచేయలేదు. అందరూ మెట్ల మార్గం ద్వారా పరుగు తీశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ఇంటి యజమాని తెలిపారు. పది ఫ్లోర్లు ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో వందలాది కుటుంబాల నివసిస్తున్నాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేయడంతో ఇతర ఫ్లాట్లకు ఎటువంటి సమస్య లేకుండాపోయింది.
ఎంవీవీ గ్రీన్‌ఫీల్డ్ గేటెడ్ భవన్‌లో అగ్నిప్రమాదం


