స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై చంద్రబాబుది నటన
డాబాగార్డెన్స్ : ఎంతో మంది ప్రాణతాగ్యంతో ఏర్పాటైన విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెతక వైఖరితో నటన సాగిస్తున్నాడని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మండిపడ్డారు. డిసెంబర్ 31లోగా కేంద్రాన్ని ఒప్పించి విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించేలా చూడాలని, లేకుంటే ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
గురువారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గారా సూర్యారావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం చంద్రబాబు వెంటనే కేంద్రంతో మాట్లాడి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. గూగుల్ సంస్థకు భూముల ధారాదత్తం చేయడమే గాక.. 22 వేల కోట్ల సబ్సిడీ ఇవ్వడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఓ వైపు మోంథా తుపాన్ కారణంగా పంటలు నష్టపోయి రైతులు విలవిలలాడుతుంటే.. రూ.5 వేలు ఇచ్చి చంద్రబాబు లండన్ వెళ్లిపోయారని? దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు సర్వనాశనం అవుతున్నాయన్నారు. పత్రికా స్వేచ్ఛ లేదని చెప్పారు. ఎస్సీల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను మూసేశారని, ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ఆపేశారని తెలిపారు. ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పించకుండా రోడ్డున పడేసిందన్నారు.


