బెల్టుషాప్ నిర్వాహకుడిపై కత్తితో దాడి
పోలీసుల అదుపులో నిందితులు
గాజువాక : నాతయ్యపాలెంలోని తన ఇంట్లో బెల్టుషాప్ నిర్వహిస్తున్న ఒక వ్యక్తిపై నలుగురు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. అతడి నుంచి మద్యం బాటిళ్లు, కొద్దిపాటి నగదును లాక్కెళ్లిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బెల్టుషాప్ నిర్వాహకుడు కేజీహెచ్‌లో చిక్సిత పొందుతున్నాడు. గాజువాక క్రైం పోలీసుల కథనం ప్రకారం.. దొడ్డి వెంకటరావు అనే వ్యక్తి నాతయ్యపాలెం బస్ స్టాప్ వెనుక తన ఇంట్లోనే మద్యం విక్రయిన్నాడు. అక్కడికి సమీపంలో గల రైల్వేట్రాక్ రెల్లి కాలనీకి చెందిన నలుగురు వ్యక్తులు బెల్టుషాప్ నిర్వాహకుడి వద్దకు గురువారం తెల్లవారుజామున వచ్చి మద్యం కావాలని అడిగారు. మద్యం కోసం డబ్బులు అడగ్గా, అరువు పెడతామని వారు బదులిచ్చారు. అరువు కుదరదని బెల్టుషాప్ నిర్వాహకుడు చెప్పడంతో వాగ్వాదం మొదలైంది. దీంతో అక్కడే ఉన్న ఒక మద్యం బాటిల్‌ను పగులగొట్టి ఆ బాటిల్‌తో పొడిచేస్తామని తొలుత బెదిరించారు. ఈ వాగ్వాదం ఘర్షణగా మారడంతో నిందితులు తమ వెంట తెచ్చిన రెండు కత్తులతో వెంకటరావు తలపైన, ఒంటిపైన పొడిచి గాయపరిచారు. బెల్టుషాపు నిర్వాహకుడి వద్ద ఉన్న రెండు మద్యం బాటిళ్లను, రూ.280 నగదును తీసుకొని అక్కడ్నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన వెంకటరావును కుటుంబ సభ్యులు హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న క్రైం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రాథమిక విచారణ అనంతరం ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు క్రైం సీఐ శ్రీనివాసరావు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితులపై దోపిడీ కేసు నమోదు చేసినట్టు తెలిసింది.


