ఆదాయం లెక్కల్లో తేడాలు
రెండో రోజూ కొనసాగిన ఏసీబీ దాడులు
మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.22 లక్షల డెఫిసీట్
మహారాణిపేట/మధురవాడ/పెదగంట్యాడ: జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెండో రోజు గురువారం కూడా విస్తృతంగా సోదాలు కొనసాగించారు. మహారాణిపేట, పెదగంట్యాడ, మధురవాడల్లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకకాలంలో జరిగిన ఈ తనిఖీల్లో రిజిస్ట్రేషన్ ఉల్లంఘనలు, అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా నిలిచిపోయిన కీలక డాక్యుమెంట్లను అధికారులు గుర్తించారు.
● మధురవాడలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్ మహేశ్వరరావుతోపాటు మరో ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో సుమారు 13 మంది సిబ్బంది రెండు రోజు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 60 వరకు రిజిస్ట్రేషన్లు పూర్తయిన డాక్యుమెంట్లు కక్షిదారులకు ఇవ్వకుండా ఉంచినట్లు అధికారులు గుర్తించారు. 296 జీవో కింద పేదలకు ఇచ్చిన పట్టాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సుమారు 200 డాక్యుమెంట్లు కార్యాలయంలో నిలిచిపోయి ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లన్నింటినీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ చక్రపాణితోపాటు ఇతర కక్షిదారులను విచారించారు. కార్యాలయంతో సంబంధం లేని నలుగురు వ్యక్తులను బుధవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోగా.. వారు డాక్యుమెంట్ రైటర్లేనని తేలింది. అయితే వీరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రెండో రోజు సోదాల సందర్భంగా ఉదయం 11.30 గంటల వరకు కార్యాలయ ప్రధాన ద్వారం తాళానికి సీల్ వేయడం చర్చనీయాంశమైంది. అలాగే 10 మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. లెక్కల్లో చూపిన ఆదాయం కంటే రూ.22 లక్షలు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
● సూపర్ బజార్ ఆవరణలోని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలు, రికార్డులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరిగిన ఉల్లంఘనలు, పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ దరఖాస్తులు, నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ అమ్మకాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
● పెదగంట్యాడలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం రాత్రి 11 గంటల వరకు కొనసాగిన సోదాలు.. గురువారం ఉదయం 9 గంటలకు మళ్లీ ప్రారంభమయ్యాయి. రాత్రి 9 గంటల వరకు సాగిన తనిఖీల్లో అధికారులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన దస్తావేజులను తనిఖీ చేశారు. అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఇందుకు సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.
ఆదాయం లెక్కల్లో తేడాలు


