విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిద్ధం
విశాఖ సిటీ: మోంథా తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఏర్పడే అంతరాయాలను అత్యంత వేగంగా పునరుద్ధరించేందుకు ఏపీఈపీడీసీఎల్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. సంస్థ పరిధిలోని 11 జిల్లాల అధికారులను ముందుగానే అప్రమత్తం చేశామని చెప్పారు. ఇందు కోసం సుమారు 15 వేల విద్యుత్ స్తంభాలు, 950 ట్రాన్స్‌ఫార్మర్లు, 115 క్రేన్లు, 80 జేసీబీలు, 144 వైర్‌లెస్ హ్యాండ్‌సెట్లు, 285 పవర్‌సాలు, 254 పోల్ డ్రిల్లింగ్ యంత్రాలు, మొబైల్ డీటీఆర్ రిపేర్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. తుపాను పునరుద్ధరణ చర్యలు పూర్తయ్యే వరకు ఉద్యోగుల సెలవులను రద్దు చేసినట్లు చెప్పారు. సంస్థ పరిధిలోని ఇతర జిల్లాల నుంచి సుమారు 7 వేల మంది సిబ్బంది, అవసరమైన సామగ్రిని పెద్ద ఎత్తున తుపాను ప్రభావిత ప్రాంతాలకు తరలించామన్నారు. రాష్ట్రంలోని ఇతర విద్యుత్ సంస్థల నుంచి కూడా సుమారు 2 వేల మంది సిబ్బంది సహాయక చర్యల కోసం చేరుకున్నారన్నారు. అత్యవసర సేవలైన తుపాను సహాయక కేంద్రాలు, హాస్పిటళ్లు, మొబైల్ టవర్లు, సబ్ స్టేషన్లు వంటి వాటికి నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు జనరేటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 లేదా స్థానిక కంట్రోల్ రూమ్ నంబర్లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు
విశాఖపట్నం కార్పొరేట్ కార్యాలయం
– 8331018762
విశాఖ జోన్–1 – 9490610018
జోన్–2 – 9490610020
జోన్–3 – 9491030721


