సమయం
చేజారనీయొద్దు!
మహారాణిపేట: మెదడుకు రక్తప్రసరణ ఒక్కసారిగా ఆగిపోవడం లేదా తగ్గిపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. మెదడు కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందకపోవడంతో నరాల సంబంధిత వ్యాధులు సోకుతాయి. అందులో కీలకమైనది బ్రెయిన్ స్ట్రోక్. రక్తనాళాలు పగలడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఇలాంటి వారికి వీలైనంత వేగంగా అత్యవసర వైద్య సేవలు అందించాలి. లేకుంటే ప్రాణం మీదకు వస్తుంది.
కేజీహెచ్‌లోనే నెలకు 160 కేసులు
కేజీహెచ్‌లో సగటున నెలకు సుమారు 160 స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. వీరిలో సుమారు 70 శాతం మంది పురుషులు, మిగిలిన వారు సీ్త్రలు. మొత్తం స్ట్రోక్‌లలో 17% హెమరైజ్డ్ స్ట్రోక్‌లు కాగా, మిగతా 83% ఇస్కిమిక్ స్ట్రోక్‌లేనని వైద్యులు చెప్తున్నారు. 2024 ఆగస్టు నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 14 నెలల్లో 54 మందికి థ్రాంబోలైసిస్ చేశారు. గత ఆరు మాసాల్లో ఈ రకమైన చికిత్స అవసరమైన కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మధ్య వయసు, వృద్ధ పురుషుల్లో స్ట్రోక్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరే కేసుల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య పదింతలున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అలవాట్లే ప్రధాన కారణం
పలు ఆహారపు అలవాట్ల వల్లే ఇలాంటి వ్యాధులు వస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రధాన ప్రమాద కారకాలు రక్తపోటు, మధుమేహం, అధిక కొవ్వు, పొగ త్రాగడం, మద్యపానం, ఊబకాయం, వ్యాయామం లేకపోవడం వల్ల ఎక్కువ మందికి ఈ స్ట్రోక్ వస్తోంది. నిద్రలో శ్వాస ఆగడం, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, దంత దోషాలు, గాలిలో కాలుష్యం, పండ్లు, కూరగాయలు తక్కువగా తినడం కూడా కారణాలే.
ఈ లక్షణాలుంటే..
ముఖం వంకరగా మారడం, చేతులు బలహీనమవడం, మాటలు స్పష్టంగా రాకపోవడం, ఎదుటివారి మాటల్ని అర్థం చేసుకోలేకపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఒక్కసారిగా చూపు తగ్గిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తే దాన్ని స్ట్రోక్‌గానే భావించొచ్చు. ఇలాంటి సమయంలో నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుని, సత్వర వైద్య సేవలు పొందితే ముప్పు తప్పించుకోవచ్చు.
ఒకప్పుడు 50–60 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే బ్రెయిన్ స్ట్రోక్ మాట వినేవాళ్లం. ప్రస్తుత దురలవాట్ల కారణంగా పిల్లల్లో కూడా ఈ సమస్య చూస్తున్నాం. ఇటీవల తరచూ 20–35 ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా ఈ సమస్యతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. వీటిలో 80–90 శాతం మంది సత్వర చికిత్సతో కోలుకుంటున్నా.. కొందరు స్ట్రోక్ కారణంగా పక్షవాతానికి గురై కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అక్టోబర్ 29 వరల్డ్ స్ట్రోక్ డే. ఈ ఏడాది ప్రతి నిముషం లెక్కలోకి(ఎవ్విరీ మినిట్ కౌంట్స్) థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ముందు జాగ్రత్తలే మేలు
స్ట్రోక్ నివారణకు రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచడం, పొగ త్రాగకపోవడం, మద్యపానం తగ్గించడం, వ్యాయా మం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించడం, మంచి నిద్ర అలవాటు చేసుకోవడం, గాలి కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి.
అలవాట్లలో మార్పు తప్పనిసరి
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారికి వైద్యం అందిస్తున్నాం. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. అన్ని రకాల స్ట్రోక్‌లకు వైద్యం అందించాం. చాలా మందికి తగ్గింది. కొంత మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ఒక సారి స్ట్రోక్ వచ్చిన వారు అలవాట్లలో మార్పు చేసుకోవాలి.
– డాక్టర్ ఎస్.గోపి, న్యూరాలజీ
విభాగాధిపతి, ఏఎంసీ/కేజీహెచ్
సత్వర వైద్యంతో మేలు
పక్షవాతాన్ని త్వరితగతిన గుర్తించి వైద్యం అందిస్తే కాపాడే వీలుంటుంది. ఆలస్యం జరిగితే ప్రాణాలకే ముప్పు. నూతన చికిత్సా విధానాలైన థ్రాంబోలైసిస్ లేదా థ్రాంబెక్టమీ ద్వారా మనిషి పూర్తిగా కొలుకునే అవకాశం ఉంటుంది. ఎంత వేగంగా చికిత్స అందిస్తే అంత మంచిది.
– డాక్టర్ సీహెచ్ విజయ్,
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కిమ్స్ ఐకాన్
సమయం


