మళ్లీ పోటీలా..
ఆరిలోవ : అండర్–17 స్కూల్ గేమ్స్‌లో భాగంగా బాలికలకు మరోసారి జిల్లా స్థాయి వాలీబాల్ ఎంపికలు నిర్వహించనున్నారు. బుధవారం ఈ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో ఎన్.ప్రేమకుమార్ ప్రకటించడంతో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వాహకులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇటీవల జిల్లా స్థాయి అండర్–14, అండర్–17 స్కూల్ గేమ్స్ జరిగాయి. ఈ పోటీల్లో పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా అండర్–17 బాలికలకు వాలీబాల్ పోటీలు నిర్వహించి విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వారి ఎంపిక సరిగా జరగలేదని కొందరు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అండర్–17 వాలీబాల్ బాలికల విభాగం ఎంపికను రద్దుచేసి.. బుధవారం ఉదయం 9 గంటలకు గోపాలపట్నం ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మళ్లీ పోటీలు నిర్వహించడానికి డీఈవో ఎన్.ప్రేమకుమార్ మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వాహకులను ఆదేశించారు. ముందు నిర్వహించిన ఎంపిక కమిటీని రద్దుచేసి కొత్త కమిటీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు డీఈవో తెలిపారు.
కూటమి ఎమ్మెల్యే ఒత్తిడితోనేనా పోటీలు
మళ్లీ వాలీబాల్ పోటీలు జరిపించి తమకు అనుకూలమైనవారిని ఎంపిక చేయాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, విద్యాశాఖ అధికారులపై కూటమి పార్టీలకు చెందిన నగరంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసినట్లు సమాచారం. వారి ఒత్తిడితోనే అండర్–17 వాలీబాల్ బాలికల విభాగం ఎంపిక రద్దు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే జరిగిన పోటీని రద్దు చేశారంటే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సక్రమంగా ఎంపికలు నిర్వహించలేదనే విమర్శలు కూడా సర్వత్రా వినిపిస్తున్నాయి.
సెలవు లేదా..?
ఓ పక్క స్కూల్ గేమ్స్ షెడరేషన్ నిర్వాహకులు విద్యార్థులకు పోటీలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. మరో పక్క మోంథా తుఫాన్ ప్రభావంతో అన్ని పాఠశాలలకు బుధవారం కూడా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ సెలవు ప్రకటించారు. అయినా కలెక్టర్ ఆదేశాలు ఈ క్రీడా పోటీల ఎంపికకు వర్తించవన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.


