ముందస్తు చర్యలు ఫలితాలనిచ్చాయి
తుపాను ప్రత్యేకాధికారి అజయ్ జైన్
మహారాణిపేట: మోంథా తుపాను దృష్ట్యా ఇప్పటివరకు జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలు మంచి ఫలితాలనిచ్చాయని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగామని ప్రత్యేక అధికారి అజయ్ జైన్, కలెక్టర్ ఎం. ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. అయితే, రాబోయే 12 గంటలు అత్యంత కీలకం కాబట్టి ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ వీసీ హాలులో ఎంపీ శ్రీ భరత్, కలెక్టర్ హరేందిర ప్రసాద్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన అజయ్ జైన్.. మోంథా తుపాను తాజా పరిస్థితిని వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలోని 10 జోన్లలో ఒక్కో జోన్‌కు రెండేసి చొప్పున క్యూఆర్‌టీ బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం 8 పునరావాస శిబిరాల్లో 144 మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు. చెట్ల కొమ్మలు, డ్రెయిన్లలో పూడికలు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ములగాడ, సీతకొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా, ఇతర చోట్ల రాళ్లు జారినట్లు గుర్తించామన్నారు. జిల్లాలోని 14 చెరువులు ప్రమాదకర స్థితిలో ఉన్నందున, ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వివరించారు. 119 చెట్లు కూలిపోగా 60 తొలగించామని, 9 విద్యుత్ స్తంభాలు పడిపోగా ఏడింటిని పునరుద్ధరించినట్లు తెలిపారు.8 గోడలు కూలిపోగా 4 చోట్ల చర్యలు చేపట్టామన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా 35 ట్యాంకులను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ వెల్లడించారు. అత్యవసరమైతే 0891–2590100, 96669 09192, 180042 500009 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.


