రైతు ఆశలపై ‘మోంథా’ నీళ్లు
4, 600 హెక్టార్ల వరికి గండం
అన్నదాతల
ఆందోళన
మహారాణిపేట: ‘మోంథా’తుపాను జిల్లా రైతాంగంపై పెను ప్రభావం చూపుతోంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, తీవ్రమైన ఈదురు గాలులతో అన్నదాతలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో వేలాది ఎకరాల పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, విశాఖ రూరల్ మండలాల పరిధిలో ఈ సీజన్‌లో రైతులు 4,602 హెక్టార్లలో వరి, 10 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు రూ. 25,000 నుంచి రూ.35,000 వరకు పెట్టుబడి పెట్టి, ఈసారి మంచి దిగుబడి వస్తుందని ఆశించారు. నవంబర్ రెండు, మూడు వారాల్లో పంటలు కోతకు సిద్ధమవుతున్న కీలక తరుణంలో తుపాను విరుచుకుపడటం వారి ఆశలపై నీళ్లు చల్లింది. తుపాను ధాటికి ఇప్పటికే 29 హెక్టార్లలో వరి పంట, 10 హెక్టార్లలో మొక్కజొన్న పంట పూర్తిగా నీట మునిగినట్లు ప్రాథమిక సమాచారం. భారీ ఈదురు గాలులకు ఏపుగా పెరిగిన వరి చేలు అక్కడక్కడ నేలకొరిగాయి. చెరువులు, జలాశయాలు నిండిపోవడంతో, పొలాల్లో చేరిన వర్షపు నీటిని బయటకు తీయలేని నిస్సహాయ స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. పొలాల్లో నీరు ఇలాగే నిలిచిపోతే ధాన్యం నాణ్యత పూర్తిగా దెబ్బతింటుందని, దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. వర్షాలు తగ్గిన తర్వాత గానీ నష్టం పూర్తిస్థాయిలో అంచనా వేయలేమని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్‌లో వచ్చే తుపాన్లు తమను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.


