వాసుపల్లి దాతృత్వం
జగదాంబ : ఆయనకు కష్టం విలువ.. పేదవాళ్ల సాదక బాధకాలు తెలుసు. తన పుట్టినిల్లు అయిన వన్‌టౌన్‌లో ఎవరికి కష్టం వచ్చినా ముందుంటారు. ఆయనే మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్. సోమవారం జీవీఎంసీ 35వ వార్డు అధ్యక్షుడు అలపన కనకరెడ్డి ఆధ్వర్యంలో వార్డులోని లక్ష్మీనగర్ లోతట్టు ప్రాంతంలో నివసించే సుమారు 250 కుటుంబాలకు రూ.1.25 లక్షలు విలువ చేసే నిత్యావసర వస్తువులు అందజేశారు. వర్షం కురుస్తున్నప్పటికీ ఆయన ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ తుఫాన్ సమయంలో పేదలు నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 3 కేజీల బియ్యం, ఆయిల్ ప్యాకెట్, కూరగాయలు, చికెన్ వంటివి అందజేశామన్నారు. రాజకీయాలు చేసే ఉద్దేశం తమకు లేదని, తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు సాయం అందించడంలో ముందుంటారన్నారు. ప్రభుత్వం తీర ప్రాంత మత్స్యకారులందరికీ 50 కేజీల బియ్యంతో పాటు రేషన్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నా జానకీరామ్, జిల్లా సెక్రటరీ ఆదివిష్ణురెడ్డి, మాజీ కార్పొరేటర్ పచ్చిరపల్లి రాము, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, సౌత్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సువార్తరాజు, సౌత్ పబ్లిక్ వింగ్ అధ్యక్షుడు బీరు సూర్యనారాయణ, మల్ల విజయ్, పీతలవాసు, రాజారెడ్డి, మాదాబత్తుల రమేష్, లండా రమణ, లింగం శ్రీను, వినోద్, రామరాజు, బెవర మహేష్, అప్పారావు, నాగిరెడ్డి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.


