దివ్యాంగుల పింఛన్లపై వేటు
మహారాణిపేట : దివ్యాంగుల పింఛన్లపై కూటమి ప్రభుత్వం వేటు వేసింది. వీరిపై కనికరం లేకుండా వివిధ పరీక్షల పేరుతో అష్టకష్టాలు పెడుతోంది. జిల్లాలో ఇప్పటికే 1,178 మంది దివ్యాంగుల పెన్షన్లు తొలగించాలని జాబితాను సిద్ధం చేసింది. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. దివ్యాంగులు అపీల్ చేసుకోవడంతో వారికి గత నెల పింఛన్లు మంజూరు చేసింది. తాజాగా అపీల్ చేసుకోలేదని కారణంగా 101 మంది దివ్యాంగుల పింఛన్లను రద్దు చేసింది.
ఆందోళనలో దివ్యాంగులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ పింఛన్లకు ఎప్పుడు ఎసరు వస్తుందోనన్న భయాందోళనతో దివ్యాంగులు కాలం వెళ్లదీస్తున్నారు. రీవెరిఫికేషన్ పేరుతో ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పునఃపరిశీలనలో తమ వైకల్య శాతాన్ని తగ్గిస్తారో.. లేదా సర్టిఫికెట్‌ను పూర్తిగా రద్దు చేస్తారేమోనని మదనపడుతున్నారు. అనారోగ్యం లేదా ఇతర కారణాలతో వెరిఫికేషన్‌కు హాజరు కాలేకపోతే పూర్తిగా పింఛన్ రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక వారికి పింఛన్ లేనట్లే..
జిల్లాలో 1,178 మంది పింఛన్లను తొలగించేందుకు జాబితా సిద్ధం చేసింది. వ్యతిరేకత రావడంతో గత నెల పింఛన్లు విడుదల చేసినప్పటికీ, ఇప్పుడు మళ్లీ పరీక్షల పేరుతో వారిని వేధిస్తున్నారు. వైద్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, బుధ, గురు, శుక్రవారాల్లో నగరంలోని నిర్దేశిత ఆస్పత్రుల్లో సర్టిఫికెట్లను రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. అయితే రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోలేదని కారణంతో జిల్లాలో 101 మంది దివ్యాంగులు పింఛన్లు రద్దు చేశారు. వీరికి నవంబర్ నెల నుంచి పింఛన్ అందదు. పుట్టుకతోనే వైకల్యంతో బాధపడుతూ, మరొకరి సాయం లేనిదే కదలలేని తమపై ప్రభుత్వం ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం అమానవీయమని, ఈ రీవెరిఫికేషన్ నిబంధనలు తమకు శాపంగా మారాయని దివ్యాంగులు కన్నీరుమున్నీరవుతున్నారు.


