మత్స్యకారుల వలల భద్రతకు చోటేది?
ఆరిలోవ: ‘మోంథా’ తుఫాను ప్రభావంతో జోడుగుళ్లుపాలెం తీరం వద్ద వలలు భద్రపరుచుకోవడానికి వీలులేని పరిస్థితి నెలకొందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను కారణంగా వేటకు వెళ్లని మత్స్యకారులు తమ వలలను అమ్మవారి గుడి ప్రాంగణంలో, చిన్న రేకుల షెడ్లలో తాత్కాలికంగా దాచుకున్నారు. వలల భద్రత కోసం పక్కా భవనం నిర్మించాలని చాలాసార్లు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును కోరామన్నారు. అయితే అటవీశాఖ అడ్డుపడుతోందని ప్రజాప్రతినిధులు తప్పించుకుంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇదే ప్రాంతంలో శివాలయం పేరుతో పక్కా నిర్మాణాలు చేపడితే అధికారులు అడ్డుచెప్పడం లేదని, తమ అవసరాల కోసం మాత్రం నిబంధనలు అడ్డుపెట్టడం సరికాదని మత్స్యకారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వలలు భద్రపరుచుకోవడానికి భవన నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు.


