ఏ సంస్థ పురోగతికై నా నైతిక విలువలే పునాది
విశాఖ సిటీ: ఏ సంస్థ పురోగతికై నా నైతిక విలువలే పునాది అని విశాఖ పోర్ట్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అరుణ్ ప్రసాద్ పేర్కొన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను విశాఖ పోర్ట్ అథారిటీలో సోమవారం ఘనంగా నిర్వహించారు. సోమవారం నుంచి నవంబర్ 2వ తేదీ జరిగే ఈ వారోత్సవాలను పోర్ట్ పరిపాలనా భవనంలోని సాంబమూర్తి ఆడిటోరియంలో ప్రారంభించారు. ముందుగా పోర్ట్ విభాగాధిపతులతో కలిసి అధికారులు, సిబ్బందితో విజిలెన్స్ ప్రమాణం చేయించారు. అనంతరం చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అరుణ్ ప్రసాద్ అవినీతి నిరోధకతపై అవగాహన కల్పించారు. విజిలెనన్స్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి కర్తవ్యనిష్టతో పనిచేయాలని సూచించారు. వారోత్సవాల్లో భాగంగా ఉద్యోగుల కోసం వివిధ పోటీలతో పాటు నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


