గూగుల్‌ వార్‌ | - | Sakshi
Sakshi News home page

గూగుల్‌ వార్‌

Oct 22 2025 6:39 AM | Updated on Oct 22 2025 6:39 AM

గూగుల్‌ వార్‌

గూగుల్‌ వార్‌

కూటమిలోనే

విశాఖ సిటీ: విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ ద్వారా 1.8 లక్షల ఉద్యోగాలు రావా? జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయా? ఈ డేటా సెంటర్‌ ఏర్పాటులో అనేక సవాళ్లు ఉన్నాయా? భవిష్యత్తులో విద్యుత్‌, నీటి సమస్య ఉత్పన్నమవుతుందా? ఇప్పటి వరకు ఐటీ, పర్యావరణ నిపుణులు సందేహాలు లెవనెత్తగా.. తాజాగా ఏపీ బీజేపీ పెద్దలు సైతం వీరితో గొంతు కలపడం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. దీంతో కూటమిలో ‘గూగుల్‌’ వార్‌ మొదలైంది. టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం అగ్గిరాజేస్తోంది. విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ క్రెడిట్‌ను టీడీపీ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. కూటమి భాగస్వామ్య పార్టీ బీజేపీ దానికి చెక్‌పెట్టే పనిలో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది. ఈ డేటా సెంటర్‌ ఘనతను కొట్టేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు చూస్తుంటే.. బీజేపీ ముఖ్య నేతలు తండ్రీ, కొడుకుల గాలి తీసేశారు. విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుతో రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుందని చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌ ఊదరగొడుతుంటే.. ఏపీ బీజేపీ చీఫ్‌, ఆ పార్టీ ఎమ్మెల్యేలు వారి బండారాన్ని బట్టబయలు చేశారు. ఈ గూగుల్‌ డేటా సెంటర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్‌.మాధవ్‌, విశాఖ ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చేసిన కీలక వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఒకవైపు గూగుల్‌పై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శిస్తూనే.. మరోవైపు చంద్రబాబు, లోకేష్‌ చెప్పినవన్నీ అబద్ధాలే అని కొట్టిపారేసేలా మాట్లాడడం ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

అన్నీ అవాస్తవాలే..

విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌పై వాస్తవాలను దాచి.. 1.8 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయని కల్లబొల్లి మాటలు చెబుతోందని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలతో పాటు ఐటీ నిపుణులు సైతం కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ డేటా సెంటర్‌ కోసం మూడు ప్రాంతాల్లో 480 ఎకరాలను కేటాయించనుంది. ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో 200 ఎకరాలు, అడవివరం ప్రాంతంలో 120 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 160 ఎకరాల కేటాయింపులకు భూములను సిద్ధం చేస్తోంది. అలాగే రూ.22 వేల కోట్ల రాయితీలను ప్రకటించేయడం పట్ల అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంద. అయితే నిర్ధిష్టమైన ప్రణాళికలు లేకుండా డేటా సెంటర్‌ ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్తులో విశాఖతో పాటు రాష్ట్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐటీ, పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా అనేక సందేహాలను లేవనెత్తుతున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో పాటు వైఎస్సార్‌ సీపీ నేతలు సైతం గూగుల్‌ డేటా సెంటర్‌ ద్వారా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తేనే ఉద్యోగాలు వస్తాయని, ఆ దిశగా సదరు కంపెనీపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ సందేహాలకు, వైఎస్సార్‌ సీపీ నేతల సూచనలపై ఇప్పటి వరకు నోరుమెదపడం లేదు.

ఏపీ బీజేపీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

గూగుల్‌ డేటా సెంటర్‌పై ఏపీ బీజేపీ చీఫ్‌ మాధవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ డేటా సెంటర్‌ ఏర్పాటులో అనేక సవాళ్లు ఉన్నాయని మీడియా సమావేశంలోనే స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ అతి పెద్ద సమస్యగా పరిణమించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డేటా సెంటర్‌ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పలేమని తేల్చి చెప్పారు. డేటా సెంటర్‌ ఏర్పాటులో అదాని కూడా భాగస్వామి అని చెప్పుకొచ్చారు. ఈ సెంటర్‌ హీట్‌ను ప్రొడ్యూస్‌ చేస్తుందని, విద్యుత్‌ వినియోగం విపరీతంగా ఉంటుందని అంగీకరించారు. గాలి, భూ కాలుష్యాన్ని అధిగమించాల్సి ఉంటుందన్నారు. అతడితో పాటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కూడా గూగుల్‌ డేటా సెంటర్‌లో ఉద్యోగాలపై అసలు వాస్తవాలను వెల్లగక్కారు. డేటా సెంటర్‌ అంటే కాల్‌ సెంటర్‌ కాదని, దీని ద్వారా 1.8 లక్షల ఉద్యోగాలు వస్తాయనడం కరెక్ట్‌ కాదని తేల్చి చెప్పారు. వీరి వ్యాఖ్యలతో చంద్రబాబు ప్రభుత్వం ఇరుకునపడింది. ఇప్పటి వరకు లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు, లోకేష్‌లు చేస్తున్న ప్రచారాలను బీజేపీ పెద్దలే తిప్పికొట్టినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ చీఫ్‌, ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు ఇప్పటి వరకు టీడీపీ పెద్దలు కౌంటర్‌ చేయలేకపోతున్నారు. కూటమి పార్టీల నేతలు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తుండడం రాజకీయంగా దుమారం రేపుతోంది.

టీడీపీ, బీజేపీ పరస్పర విరుద్ధ ప్రకటనలు

డేటా సెంటర్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు

మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

ఇందులో అనేక సవాళ్లు ఉన్నాయని

అంగీకారం

పర్యావరణ పరిరక్షణ

అతి పెద్ద సమస్య అని వెల్లడి

1.8 లక్షల ఉద్యోగాలు

వస్తాయనడం కరెక్ట్‌ కాదన్న

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు

బీజేపీ నేతల వ్యాఖ్యలతో

ఇరకాటంలో ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement