
టపాసుల మోత.. కాలుష్యం పడగ
దీపావళి రోజున
అమాంతం పెరిగిన కాలుష్యం
ప్రమాదకర స్థాయికి
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
సాయంత్రం 6 గంటలకు
ఏక్యూఐ 45 ఉండగా..
అర్ధరాత్రి 12 గంటలకు 141కి పెరుగుదల
పీఎం 2.5 రేణువులు 68 నుంచి పీక్
అవర్‌లో 500 చేరుకోవడంతో ఆందోళన
విశాఖ సిటీ : విశాఖలో దీపావళి పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. టపాసుల మోత మోగింది. తారాజువ్వలు, రంగు రంగుల షాట్స్ వెలుగుల నడుమ మహానగరం మురిసిపోయింది. సుమారు రూ.30 కోట్ల బాణసంచా వ్యాపారం జరిగింది. భారీ ఎత్తున కాల్చిన మందుగుండు సామగ్రి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపగా.. వాటి నుంచి వెలువడిన కాలుష్యం నగరాన్ని కమ్మేసింది. కాలుష్య మేఘాలు ఊపిరి సలపనివ్వకుండా చేసేశాయి. కేవలం గంటల వ్యవధిలోనే కాలుష్య కారకాలైన సల్ఫర్ డయాకై ్సడ్, నైట్రోజన్, ఆకై ్సడ్‌లు గాలిలో కలిసిపోయి రెట్టింపు స్థాయికి కాలుష్యం పెరిగిపోయింది. సాయంత్రం కేవలం ఆరు గంటల వ్యవధిలోనే గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) రెండు రెట్లు అధికంగా నమోదైంది. ఒకపక్క వాయు కాలుష్యం, మరోపక్క శబ్ద కాలుష్యంతో విశాఖ వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సాధారణంగా పార్టికులెట్ మేటర్– పీఎం 10, పీఎం 2.5 కారకాలు ఎక్కువగా నమోదు కావడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆందోళనకరంగా గాలి నాణ్యత
దీపావళి వేళ కాల్చిన టపాసులు గాలిని తీవ్రంగా కలుషితం చేశాయి. గాలి కాలుష్య రేణువులు క్యూబిక్ మీటరుకు 60 మైక్రో గ్రాములు మించితే ప్రమాదం. కానీ పీఎం 2.5 రేణువులు సాయంత్రం 7 గంటలకు 68గా ఉండగా.. రాత్రి 11 తర్వాత నుంచి 12 వరకు ఏకంగా 500 మైక్రోగ్రాములుగా, పీఎం 10 రేణువులు 67 నుంచి 464 మైక్రోగ్రాములుగా నమోదయ్యాయి. గతేడాది దీపావళిలో కూడా ఇదే స్థాయిలో పీక్ అవర్ గణాంకాలు నమోదైనట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత నుంచి మళ్లీ కాలుష్యం తగ్గడం ప్రారంభమైంది. ఈ తరహా వాయు, శబ్ద కాలుష్యం కారణంగా కేవలం మనుషులకే కాదు.. పక్షులు, జంతువులపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. టపాసులు కాల్చడం వల్ల వెలువడే అధిక కాంతి, శబ్దాల కారణంగా పక్షులు సురక్షిత ప్రాంతానికి తమ ఆవాసాల నుంచి భయంతో వెళ్లిపోతాయి. ఇవి తిరిగి వెనక్కి రావు. జీవ వైవిధ్యానికి ఇది చేటు కలిగిస్తుంది. వాయు కాలుష్యం ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపుతోంది. ఊపరితిత్తుల ఇన్ఫెక్షన్, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. చిన్నారుల్లో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దుమ్ము, ధూళి, రసాయన అవశేషాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది.
ఏక్యూఐ 45 నుంచి 141కి పెరుగుదల
దీపావళి రోజు సాయంత్రం టాపాసుల మోతతో తీవ్ర స్థాయిలో కాలుష్యం పెరిగిపోయింది. సాయంత్రం 6 గంటలకు ఏక్యూఐ 45 ఉండగా.. అర్ధరాత్రి 12 గంటలకు 141కి చేరుకుంది. సాధారణంగా ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్ 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తిగా, అదే ఏక్యూఐ 101 నుంచి 200 అయితే మోడరేట్‌గా, అంతకు మించి 201 నుంచి 300 అయితే పూర్, 301 నుంచి 400 వరకు అయితే వెరీ పూర్, 401 నుంచి 500 అయితే తీవ్ర ఆందోళనకర పరిస్థితిగా పేర్కొంటారు. అయితే విశాఖలో మాత్రం ప్రతి గంటకు గాలి నాణ్యత సూచీ పెరుగుతూ పోయింది. సాయంత్రం 6 గంటలకు ఏక్యూఐ 45 ఉండగా.. 7 గంటలకు 47, 8కి 55, 9కి 78, 10కి 105, 11కి 125, అర్ధరాత్రి 12 గంటలకు అత్యధికంగా 141కి చేరుకుంది.

టపాసుల మోత.. కాలుష్యం పడగ