
తాత్కాలిక వసతులకే రూ.36 లక్షలా?
డాబాగార్డెన్స్: విశాఖ ప్రపంచ యోగా దినోత్సవం జరిగి నాలుగు నెలలు గడిచిపోయినా.. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఖర్చుల బిల్లులు ఇప్పుడు ఆమోదం కోసం రావడం చర్చనీయాంశమైంది. ‘అయిపోయిన పెళ్లికి మేళాలు’ అన్నట్లుగా.. జీవీఎంసీ అధికారులు కార్యక్రమం ముగిసిన నెలల తర్వాత తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి ఏర్పాట్లకు అయిన ఖర్చుల ఆమోదం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సుమారు 3 నుంచి 4 లక్షల మంది హాజరవుతారని అంచనా వేసి, జీవీఎంసీ తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, వీధిలైట్లు వంటి కనీస సదుపాయాలను కల్పించింది. ఈఈ–2 డివిజన్ పరిధిలోని జోన్–3, 4, 5లలో ఏర్పాటు చేసిన వసతి కేంద్రాలకు 20 లీటర్ల నీటి బబుల్స్, వాటర్ బాటిళ్లు, పేపర్ గ్లాసుల ద్వారా తాగు నీటిని సరఫరా చేశారు. తాత్కాలిక మరుగుదొడ్లకు పీవీసీ ఫిట్టింగులతో అవుట్‌లెట్‌లు ఏర్పాటు చేయడం, తాగునీటి కోసం డ్రమ్ములు, బకెట్లు, జగ్గులు సమకూర్చడం వంటి పనులను జీవీఎంసీ అధికారులు నామినేషన్ పద్ధతిలో ఐదుగురు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ పనుల కోసం నవీన్ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.13.85లక్షలు, రామిశెట్టి సురేష్‌కు రూ.12లక్షలు, ఎల్‌జేఆర్‌వీ కోటేశ్వరరావుకు రూ.4.89 లక్షలు, జి.అప్పన్నకు రూ.3.60 లక్షలు, టి.వీరారెడ్డికి రూ.1.70 లక్షలు కలిపి సుమారు రూ. 36 లక్షలు ఖర్చు చేసినట్లు చూపుతున్నారు. కేవలం తాత్కాలిక మరుగుదొడ్లు, నీటి డ్రమ్ముల వంటి పనులకు రూ.36 లక్షలకు పైగా ఖర్చు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం జరగనున్న జీవీఎంసీ స్థాయీ సంఘం సమావేశంలో ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్నారు. నాలుగు నెలల ఆలస్యంగా వస్తున్న ఈ బిల్లులపై సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.!
నాలుగు నెలల తర్వాత
యోగా డే ఖర్చులపై నేడు చర్చ