
భాగస్వామ్య సదస్సుకు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట: విశాఖలో వచ్చే 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో జేసీ కె. మయూర్ అశోక్, సీఐఐ ప్రతినిధులు, ఇతర జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. ఎక్కడా లోపాలు తలెత్తకుండా సీఐఐ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని, నవంబర్ 13 సాయంత్రం నుంచే కార్యకలాపాలు మొదలవుతాయి కాబట్టి అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాలన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని వెంటనే స్వాధీనం చేసుకొని, లెవెలింగ్, చిన్న రాళ్లను తొలగించి, బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలన్నారు. ఆకర్షణీయంగా ఉండేలా పెయింటింగులు వేయించాలన్నారు. వీఐపీలు, అతిథుల కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు, పక్కాగా ఎంట్రీ.. ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు, మొబైల్ టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బుధవారం నుంచే ఏయూ మైదానంలో అంబులెన్స్, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు తప్పకుండా పాటించి, తనిఖీలు పూర్తిచేయాలని అగ్నిమాపక శాఖ అధికారికి సూచించారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే అతిథులకు సరిపడా హోటల్ రూమ్‌లను, హోం స్టేలను ముందుగానే బుకింగ్ చేసుకోవాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే, విద్యుత్ సరఫరా, బీఎస్‌ఎన్‌ఎల్, ఇతర నెట్‌వర్క్‌ల ద్వారా కనెక్టివిటీ కల్పించాలని సూచించారు. సదస్సు విజయవంతం కావడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.