
డీఆర్వో, ఆర్డీవోల బదిలీ
మహారాణిపేట : విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) బి.హెచ్.భవానీశంకర్, విశాఖ డివిజనల్ రెవెన్యూ అధికారి(ఆర్డీవో) పి.శ్రీలేఖకు బదిలీ అయింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇద్దరికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జేఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
బాధ్యతల స్వీకరణ : ఇన్‌చార్జి డీఆర్వోగా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ఇన్‌చార్జి విశాఖ ఆర్డీవోగా హెచ్‌పీసీఎల్ భూసేకరణ అధికారి, డిప్యూటీ కలెక్టర్ ఎస్.సుధాసాగర్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
కలకలం సృష్టించిన శ్రీలేఖ
రెవెన్యూ శాఖలో వ్యవహారాలపై విశాఖ ఆర్డీవో శ్రీలేఖ రాసిన లేఖ కలెక్టరేట్‌లో కలకలం సృష్టించింది. జిల్లా రెవెన్యూ అధికారిపై పలు అవినీతి ఆరోపణలు చేయడం రెవెన్యూ శాఖను కుదిపేసింది. తహసీల్దార్ల నుంచి నెలవారి మామూళ్లు, సరకులు తీసుకుంటున్నట్టు ఆమె నేరుగా డీఆర్వోపై కలెక్టర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ విషయంపై వాడిగా వేడిగా చర్చ సాగింది. ఇద్దరిపై బదిలీ వేటు పడడంతో ఈ వ్యవహారం ఇక్కడే సద్దుమణిగింది.

డీఆర్వో, ఆర్డీవోల బదిలీ