
అప్పన్న ఆలయ లీకేజీ పనులు పూర్తి
సింహాచలం: సింహగిరిపై శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ పైకప్పు మరమ్మతు పనులు శుక్రవారంతో పూర్తయ్యాయి. వర్షాలకు ఆలయ పైకప్పు నుంచి నీరు లోపలికి చేరుతుండటంతో ఆలయంతోపాటు, ఆలయ ప్రాంగణంలోని కల్యాణమండపం, నివేదనశాల, మ్యూజియం ఉన్న భవనంలో లీకేజీలు అరికట్టేందుకు 9 నెలల కిందట శాసీ్త్రయ పద్ధతిలో పనులు ప్రారంభించారు. ఆ పనులు పూర్తికావడంతో సింహగిరిపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి పురావస్తుశాఖ డైరెక్టర్ ముణిరత్నంరెడ్డి సంబంధిత వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో తొలుత శ్రీకాళహస్తి ఆలయంలో వర్షం నీరు లీకేజీని అరికట్టే పనులు చేపట్టామన్నారు. ఆ రోజుల్లో నిర్మాణ పనులు ఎలా చేశారో అదే పద్ధతిలో శ్రీకాళహస్తి ఆలయంలో లీకేజీలను అరికట్టేందుకు పుణేకి చెందిన శ్రీవెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్(వెంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్)ను సంప్రదించామన్నారు. అక్కడ ఉత్తమ ఫలితాలు రావడంతో ఆ తర్వాత శ్రీశైలం ఆలయంలో పనులు చేపట్టామన్నారు. సింహాచలం ఆలయం పైకప్పు లీకేజీ పనుల విషయాన్ని ఎమ్మెల్యే గంటా సూచనలతో వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రూ.5 కోట్ల సొంత వ్యయంతో 9 నెలల్లో లీకేజీ నిర్మూలన పనులను ట్రస్ట్ పూర్తిచేసిందన్నారు. మరో 200 ఏళ్ల వరకు ఎలాంటి లీకేజీలు ఉండవన్నారు. గంటా మాట్లాడుతూ అప్పన్న ఆలయంలోకి వర్షం నీరు చేరకుండా గతంలో పలుమార్లు నివారణ పనులు జరిగినా పూర్తిగా సఫలీకృతం కాలేదన్నారు. దీంతో వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్‌ని సంప్రదించి, పురాతన ఆలయాల నిర్మాణ సాంకేతికతను ఉపయోగించి వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ లీకేజీలను అరికట్టే పనుల్ని చేసిందన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో వి.త్రినాథరావు, అర్చకులు, 98వ వార్డు కార్పొరేటర్ పీవీ నరసింహం, తదితరులు పాల్గొన్నారు.
రూ.5 కోట్లతో పూర్తి చేసిన శ్రీవెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్