
కాసుల వేట
కమర్షియల్ ట్యాక్స్‌కు
కాసులు కురిపిస్తున్న దీపావళి
సాక్షి, విశాఖపట్నం: జిల్లా శివారు ప్రాంతానికి ఒడిశా నుంచి ఓ పెద్ద వ్యాన్ వచ్చింది. ముందస్తు సమాచారం మేరకు వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది ఆ వ్యాన్‌ను అడ్డగించారు. తెరిచి చూస్తే.. అందులో భారీగా బాణసంచా సామగ్రి ఉంది. కానీ, దానికి సంబంధించిన ఎలాంటి బిల్లులూ లేవు. సీజ్ చేస్తామంటూ హడావుడి చేశారు. కానీ అరగంటలోనే అంతా సద్దుమణిగింది. పట్టుకున్నప్పుడు మతాబులా వెలిగిన కేసు.. కాసేపటికే చైనా టపాసులా తుస్సుమనిపోయింది. ఇందుకు కారణం.. అందులోని టపాసులు కాస్తా ‘కాసులు’గా మారి అధికారుల జేబుల్లోకి చేరడమే? వాణిజ్య పన్నుల శాఖలోని కొందరు సిబ్బందికి దీపావళి కాసుల వర్షం కురిపిస్తోంది. బిల్లులు లేకుండా వస్తున్న వాహనాలను పట్టుకోవడం, వ్యాపారులతో బేరసారాలు జరిపి పండగ చేసుకోవడం.. గత వారం రోజులుగా ఇదే తంతు సాగుతోంది. సరకు విలువను బట్టి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. చివరికి.. క్రాకర్స్ దుకాణాల లైసెన్సుల విషయంలోనూ పక్కా ‘కమర్షియల్’గా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దొడ్డిదారిన బాణసంచా
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండగను జరుపుకొంటాం. కానీ, వాణిజ్య పన్నుల శాఖలోని కొందరికి మాత్రం ఇది కాసులు కురిపించే పండగగా మారింది. బాణసంచా కొనుగోళ్లు, దిగుమతులు, స్టాల్స్ అనుమతుల పేరుతో ప్రభుత్వ ఖజానాకు వచ్చేది గోరంత అయితే.. సిబ్బంది జేబుల్లోకి చేరుతున్నది కొండంత అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పదుల సంఖ్యలో వాహనాలు ఎలాంటి బిల్లులు లేకుండా జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించాయి. ఈ సమాచారం తెలుసుకున్న నిఘా బృందాలు విజయనగరం, ఒడిశా మార్గాల్లో పహారా కాశాయి. అయితే, ఒకట్రెండు వాహనాలను పట్టుకున్నట్లు చూపించిన సిబ్బంది.. మిగిలిన వాటిని చూసీచూడనట్లు వదిలేశారని తెలుస్తోంది. వ్యాపారులతో కుమ్మక్కై.. భారీగా మామూళ్లు అందుకొని విడిచిపెట్టారని సమాచారం. ఈ వాహనాల్లోని బాణసంచా విలువ ఆధారంగా రేటు కట్టి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. వీటిని నిజాయతీగా పట్టుకొని, విలువ ఆధారంగా పన్ను విధిస్తే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేరేది. కానీ, కొందరు సిబ్బంది తమ జేబులు నింపుకోవడానికి సొంత శాఖకే కన్నం వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా రూ. కోట్ల విలువైన బాణసంచా ఎలాంటి అనుమతులు, బిల్లులు లేకుండా నగరంలోకి దొడ్డిదారిన చేరిందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నీకూ లాభం.. మాకూ లాభం
నగర పరిధిలో బాణసంచా అమ్మకాల కోసం జీవీఎంసీ, రెవెన్యూ, అగ్నిమాపక, విద్యుత్, పోలీస్ శాఖల అధికారులతో కూడిన కమిటీ నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరి. ఇక్కడే వాణిజ్య పన్నుల విభాగం సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. తాత్కాలిక విక్రయదారులకు డీలర్‌షిప్ ఉండదు కాబట్టి, వారికి అడ్వాన్స్‌డ్ లైసెన్స్‌లు జారీ చేస్తారు. దీని ప్రకారం తాము విక్రయించబోయే సరకు విలువపై 18శాతం జీఎస్టీని ముందుగానే చెల్లించాలి. ఉదాహరణకు రూ.లక్ష విలువైన సరకు అమ్మితే రూ.18వేలు పన్నుగా చెల్లించాలి. వ్యాపారం ముగిశాక, అమ్మిన సరకు విలువ అంచనా కన్నా ఎక్కువైతే మిగిలిన పన్ను చెల్లించాలి లేదా తక్కువైతే అదనంగా కట్టిన డబ్బును అధికారులు వాపసు ఇవ్వాలి. అయితే, ఇక్కడే కొందరు సిబ్బంది వ్యాపారులతో కుమ్మక్కవుతున్నారు. ‘ఎంత సరకై నా అమ్ముకో.. ప్రభుత్వానికి కొద్దిగా పన్ను కట్టి, మాకు కొంత మామూలు ఇస్తే చాలు. నీకూ లాభం, మాకూ లాభం’ అంటూ లెక్కలతో సహా వివరిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం డివిజన్ కార్యాలయంలోని ఓ అధికారి ఆదేశాలతో.. సర్కిళ్ల వారీగా వసూళ్లకు ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని కింది నుంచి పై స్థాయి వరకు పంచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ విధంగా కొందరు అధికారులు బాణసంచా వ్యాపారం పేరుతో ‘అడ్డగోలు వసూళ్ల దీపావళి’ని ఘనంగా జరుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గుట్టుచప్పుడు కాకుండా బాణసంచా దిగుమతి చేస్తున్న వ్యాపారులు
పట్టుకొని వదిలేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది
బాణసంచా విలువను బట్టి.. వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు
లైసెన్సులు మంజూరు విషయంలోనూ చేతివాటం

కాసుల వేట