
డీఆర్వోకు కలెక్టర్ క్లాస్?
రెవెన్యూలో ‘లేఖ’ప్రకంపనలు
మహారాణిపేట: ఆర్డీవో శ్రీలేఖ రాసిన లేఖ వ్యవహారంపై ‘రెవెన్యూలో శ్రీలేఖ కలకలం’ శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం జిల్లా రెవెన్యూ శాఖలో ప్రకంపనలు సృష్టించింది. ఉన్నతాధికారుల మధ్య కోల్ట్‌వార్ వెలుగులోకి రావడంతో రెవెన్యూ, నిఘా వర్గాల ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి.. ఏం జరుగుతుందోనని ఆరా తీశారు. జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్ శుక్రవారం హుటాహుటిన కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్‌ను కలిశారు. ఈ అంశంపై వారిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో డీఆర్వో తీరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఆయనకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వివాదంపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు కూడా స్పందించారు. కలెక్టర్‌ను కలిసి, శాఖ ప్రతిష్టకు భంగం కలగకుండా తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని, అనవసర రాద్ధాంతం చేయవద్దని కలెక్టర్ వారికి సూచించినట్లు సమాచారం.