
అన్ని రంగాల్లో విశాఖ ముందంజలో ఉండాలి
మహారాణిపేట : విశాఖ జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా అధికారులు కృషి చేయాలని ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ–మానటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి ప్రాజెక్టులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారులను.. నగర రహదారులకు అనుసంధానం చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణ పథకాల్లో ప్రగతి సాధించాలని, పీఎం సూర్యఘర్ యూనిట్లను ఎక్కువ సంఖ్యలో నెలకొల్పాలన్నారు. అభివృద్ధి పేరుతో తవ్వుతున్న రోడ్లను నిర్ణీత కాలంలో పూడ్చివేయాలన్నారు. అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. వర్కింగ్ వుమెన్స్ వసతి గృహాలను త్వరితగతిన పట్టాలెక్కించాలన్నారు. మేజిక్ డ్రైన్లను నిర్మించాలని, వాటి ద్వారా కలిగే ఫలితాలను పరిశీలించి నివేదించాలని చెప్పారు.
తుఫాన్లు, వర్షాల సమయంలో రక్షణ ఉండేలా గ్రేట్ గ్రీన్‌వాల్ పేరుతో నాటే మొక్కల విధానాన్ని కొనసాగించాలన్నారు. క్రీడలకు అనుగుణంగా వసతులను కల్పించాలన్నారు. జలవనరులను సంరక్షించాలని, భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అమృత్, జలజీవన్ మిషన్ పథకం ద్వారా తాగునీరు అందించాలని చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించాలని, డస్ట్ బిన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటీవల తొలగించిన దుకాణాల ఏర్పాటులో అర్హులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని తేల్చి చెప్పారు. ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పలు ప్రజా సమస్యలను ప్రస్తావించారు. డైమండ్ పార్కు వద్ద జీవీఎంసీ స్థలంలో మల్టీలెవెల్ పార్కింగ్ ప్రాజెక్టు చేపడితే ప్రయోజనం ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ కె.మయూర్ అశోక్, జెడ్పీ సీఈవో, దిశా కన్వీనర్ నారాయణమూర్తి, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
అధికారులను ఆదేశించిన ఎంపీ శ్రీ భరత్