రాజకీయ కక్షతోనే బదిలీ..! | - | Sakshi
Sakshi News home page

రాజకీయ కక్షతోనే బదిలీ..!

Oct 10 2025 7:58 AM | Updated on Oct 10 2025 7:58 AM

రాజకీయ కక్షతోనే బదిలీ..!

రాజకీయ కక్షతోనే బదిలీ..!

విశాఖ సిటీ : విశాఖ అభివృద్ధికి కీలకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి.. సమర్థవంతమైన, నిజాయతీ గల అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌పై కూటమి ప్రభుత్వం బదిలీ వేటు వేయడంపై అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. కూటమి నేతల అక్రమాలు సాగనీయడం లేదన్న అక్కసుతోనే ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చి బదిలీ చేయించినట్లు వార్తలు గుప్పుమం టున్నాయి. ప్రధానంగా మాస్టర్‌ప్లాన్‌లో ఇష్టానుసారంగా మార్పులు, చేర్పులకు కూటమి ప్రజాప్రతినిధులు గట్టిగా పట్టుబడుతున్నారు. వారి భూములు, అనుచరుల వ్యాపారాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌లో సవరణలకు చేస్తున్న సిఫార్పులను పట్టించుకోని కారణంగానే కూటమి నేతలు కత్తి కట్టినట్లు వార్తలు వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ కమిషనర్‌పై కక్ష కట్టి ఎమ్మెల్యేలతో ఫిర్యాదు చేయించినట్లు గత కొద్ది నెలలుగా అధికారుల మధ్య చర్చ జరుగుతోంది. మూడు నెలలుగా కమిషనర్‌ను బదిలీ చేస్తున్నట్లు ప్రచారం లెవనెత్తారు. ఇందుకు తగ్గట్లుగానే కమిషనర్‌ విశ్వనాథన్‌ను ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం.

పాలనలో తనదైన ముద్ర

కె.ఎస్‌.విశ్వనాథన్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసిన నాటి నుంచి సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. రాజకీయ, అధికారుల అక్రమాలకు అడ్డుకట్టవేస్తూ వస్తున్నారు. అనంతరం ఆయన జీవీఎంసీ అదనపు కమిషనర్‌గా కొన్నాళ్లు పనిచేసి 2024, జూలై 23న వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా విశ్వనాథన్‌ బాధ్యతలు చేపట్టారు. సంస్థలో దీర్ఘకాలంగా నెలకొన్న అవినీతిపై దృష్టి పెట్టారు. వీఎంఆర్‌డీచే చేపట్టిన అనేక ప్రాజెక్టులు ఏళ్లుగా సా..గుతున్న ప్రాజెక్టులతో పాటు అధికారులను సైతం పరుగులు పెట్టించారు.

అక్రమాలకు అడ్డుపడుతున్నారనే అక్కసుతో..

నిక్కచ్చిగా ఉండే విశ్వనాథన్‌ వ్యవహార శైలిపై కూటమి నేతలు ముందు నుంచీ గుర్రుగా ఉన్నారు. ఇదే సమయంలో వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా ప్రణవ్‌గోపాల్‌ నియమితులయ్యారు. కమిషనర్‌గా విశ్వనాథన్‌ ఉంటే వీఎంఆర్‌డీఏలో తమ అక్రమాలు సాగవన్న నిర్ణయానికి వచ్చారు. కొద్ది నెలల క్రితం కమిషనర్‌ విశ్వనాథన్‌, చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ మధ్య వివాదం చోటుచేసుకుంది. ఒక హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో కమిషనర్‌ను చైర్మన్‌ దఫేదార్‌ తోశారు. దీనిపై కమిషనర్‌ విశ్వనాథన్‌ అతడిపై సీరియస్‌ అయ్యారు. ఇదే అదునుగా భావించిన చైర్మన్‌.. కమిషనర్‌కు వ్యతిరేకంగా సిబ్బందితో నిరసన చేయించాలని భావించినట్లు సంస్థలో చర్చ జరిగింది. ఆ పనిచేయకపోయినప్పటికీ.. కమిషనర్‌పై ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేయించినట్లు వార్తలు వినిపించాయి. అతడిని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారన్న టాక్‌ ఉంది. గత కొద్ది నెలలుగా కమిషనర్‌ బదిలీ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఐ అండ్‌ పీఆర్‌ డైరెక్టర్‌గా బదిలీ

తాజాగా ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ విశ్వనాథన్‌ కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక్కడి నుంచి ఐ అండ్‌పీఆర్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించలేదు. కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిరప్రసాద్‌కు వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

అక్రమాలు సాగవన్న అక్కసుతోనే

ప్రజాప్రతినిధుల ఫిర్యాదులు?

వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ విశ్వనాథన్‌పై బదిలీ వేటు

ఐ అండ్‌ పీఆర్‌ డైరెక్టర్‌గా నియామకం

కలెక్టర్‌కు వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement