బతుకు పడవలు | - | Sakshi
Sakshi News home page

బతుకు పడవలు

Sep 23 2025 11:19 AM | Updated on Sep 23 2025 11:19 AM

బతుకు

బతుకు పడవలు

● తగ్గిన చేపల లభ్యత ● హార్బర్‌కే పరిమితమైన బోట్లు ● వలసపోతున్న మత్స్యకారులు ● ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి

ఒడ్డున ఆగిన

ఆశాజనకంగా లేని వేట

తూర్పు తీరంలో మత్స్యకారుల బతుకుచిత్రం ఆందోళనకరంగా మారింది. వేట సీజన్‌ ప్రారంభమై మూడు నెలలు గడిచినా, వారి వలలకు ఆశించిన సంపద చిక్కడం లేదు. వేటకు వెళ్తే లక్షల్లో ఖర్చు, తిరిగి వస్తే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కని దుస్థితి. దీంతో విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లోని 643 బోట్లకు గాను కేవలం 150 బోట్లు మాత్రమే నామమాత్రంగా వేటకు వెళ్తున్నాయి. సుమారు 80 శాతానికి పైగా మరబోట్లు ఒడ్డుకే పరిమితమై, అప్రకటిత వేట విరామాన్ని పాటిస్తున్నాయి. ఉపాధి లేక ఎందరో మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలసపోతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఆరంభ శూరత్వమే..

విశాఖ చేపల రేవు తూర్పు తీరానికి కేంద్రంగా ఉంది. జూన్‌ 15న వేట నిషేధం ముగిసినప్పుడు మత్స్యకారులు ఎన్నో ఆశలతో సముద్రంలోకి అడుగుపెట్టారు. తొలి రెండు నెలలు చేపలు, రొయ్యల దిగుబడి జోరుగా సాగడంతో ఈ సీజన్‌ తమను ఆదుకుంటుందని భావించారు. కానీ ఆగస్టు నుంచి పరిస్థితి తలకిందులైంది. చేపల లభ్యత క్రమంగా తగ్గుతూ వచ్చి, సెప్టెంబర్‌ నాటికి పూర్తిగా పడిపోయింది. దీంతో వేట గిట్టుబాటు కాక.. యజమానులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. 15 రోజుల వేటకు సుమారు రూ. 3.5 లక్షలు ఖర్చవుతుంటే, కనీస ఆదాయం కూడా రాకపోవడంతో బోట్లను హార్బర్‌లోనే నిలిపివేయడమే శ్రేయస్కరమని భావిస్తున్నారు. కాగా.. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు కోట్లాది రూపాయల విలువ చేసే మత్స్య దిగుబడులు వచ్చాయని మత్స్య పరిశ్రమ వర్గాలు చెబుతుంటే.. సుమారు 40 శాతం మేర తగ్గిపోయాయని వ్యాపారులు అంటున్నారు.

ట్యూనా వేటదీ అదే కథ

అధిక ధర పలికే ట్యూనా చేపల లభ్యత కూడా అంతంతమాత్రంగానే ఉంది. 70 నుంచి 100 వరకు బోట్లు ట్యూనా కోసం వెళ్లినా, ఆశించిన ఫలితం దక్కడం లేదు. నాణ్యమైన గ్రేడ్‌–1 ట్యూనా చేపలు దొరికినా, వాటిని 48 గంటల్లోపు ఎగుమతి చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు విశాఖ హార్బర్‌లో లేవు. దీంతో చేతికొచ్చిన అవకాశాన్ని కూడా జారవిడుచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కాగా.. జిల్లాలో 32 మత్స్యకార గ్రామాలు, సుమారు 1.5 లక్షల జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు వేట సంక్షోభంలో కూరుకుపోవడంతో వేలాది కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

కారణాలెన్నో.. కష్టాలెన్నో..

మత్స్య సంపద తగ్గడానికి ప్రధాన కారణం సముద్ర వాతావరణంలో వస్తున్న మార్పులేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సముద్ర ఉపరితలం వేడెక్కడంతో చేపలు, రొయ్యలు చల్లదనం కోసం లోతైన ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయి. అంత లోతుకు వెళ్లి వేటాడే సాంకేతికత, వనరులు సాధారణ మత్స్యకారులకు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు, పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు సముద్రంలో కలవడం వల్ల కాలుష్యం పెరిగిపోయి, మత్స్య సంపద నశించిపోతోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్‌ భారం పెరిగిపోవడంతో వేట గిట్టుబాటు కావడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సముద్రమే జీవనాధారంగా బతికే గంగపుత్రుల జీవితాలు.. ఇప్పుడు అలల తాకిడికి కొట్టుకుపోతున్నాయి. ఎన్నో ఆశలతో ప్రారంభమైన వేట సీజన్‌.. వారి ఆశలను ఆవిరి చేస్తూ కన్నీటి గాథగా మారుతోంది. లక్షలు పెట్టుబడిగా పెట్టి సముద్రంలోకి వెళ్తే, కనీసం డీజిల్‌ ఖర్చులు కూడా రాక, బోట్లను ఒడ్డుకే కట్టేసి నిస్సహాయంగా చూస్తున్నారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ .. ఒకప్పుడు వేలాది బోట్ల రాకపోకలతో, మత్స్యకారుల కోలాహలంతో సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు 80 శాతానికి పైగా బోట్లు లంగరేసుకుని నిశ్శబ్దంగా రోదిస్తున్నాయి. – మహారాణిపేట

ప్రభుత్వమే ఆదుకోవాలి

ప్రభుత్వం తక్షణమే స్పందించి మత్స్యకారులను ఆదుకోవాలి. పెరిగిన డీజిల్‌ ధరలు, తగ్గిన వేటతో గంగపుత్రుల బతుకులు కష్టాల్లో ఉన్నాయి. పెట్టుబడి కూడా తిరిగి రాక అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి, మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి.

– వాసుపల్లి జానకీరామ్‌,

వైఎస్సార్‌ సీపీ నాయకుడు

మత్స్య పరిశ్రమను కాపాడండి

మత్స్య పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇది కేవలం మత్స్యకారుల సమస్య కాదు, మొత్తం పరిశ్రమ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి. ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి సారించి, గిట్టుబాటు ధరలు కల్పించి, పరిశ్రమకు చేయూతనివ్వాలి. లేకపోతే ఈ వృత్తి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

– సూరాడ సత్యనారాయణ(సత్తిబాబు), ఉపాధ్యక్షులు, వైశాఖి మరపడవల సంఘం

బతుకు పడవలు1
1/2

బతుకు పడవలు

బతుకు పడవలు2
2/2

బతుకు పడవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement