
పేలిన గ్యాస్ సిలిండర్
గోపాలపట్నం: జీవీఎంసీ 90వ వార్డు విమాన్‌నగర్‌లోని ఓ ఇంట్లో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు, ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. విమాన్‌నగర్‌లోని వినాయక ఆలయం సమీపంలో ఉన్న గ్రూప్ హౌస్‌లోని మూడో అంతస్తులో ఆర్మీలో జేఈగా పనిచేస్తున్న మురళి కుటుంబం నివాసం ఉంటోంది. అతని భార్య రాధ సోమవారం ఉదయం పూజ కోసం దూపం వేయడానికి బొగ్గులు రాజేస్తుండగా, ఆ నిప్పు రవ్వలు గాలికి ఎగిరి కిటికీ తెరలకు అంటుకున్నాయి. ఆ మంటలు వాషింగ్ మెషీన్‌కు, ఆ తర్వాత దాని పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్‌కు వ్యాపించాయి. దీంతో భారీ శబ్దంతో సిలిండర్ పేలింది. దీంతో ఆమె ఇంటి నుంచి బయటకు రాగా.. ఈ శబ్దం విన్న పక్కనే ఉన్న వారు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. సిలిండర్‌పై నీళ్లు చల్లడంతో మంటలు వారిపైకి ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో డి.వి.పాత్రుడు, కె.ఎన్.కుమార్, కుమార్ సింగ్‌లతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న మర్రిపాలెం అగ్నిమాపక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా వాషింగ్ మెషీన్ పేలిందని, దాని వల్ల పక్కనే ఉన్న నిండు గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగాయని వారు తెలిపారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఐదుగురికి స్వల్ప గాయాలు

పేలిన గ్యాస్ సిలిండర్

పేలిన గ్యాస్ సిలిండర్

పేలిన గ్యాస్ సిలిండర్