
కార్మికులే రైల్వేకు బలం
ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం
పరమేశ్వర్ ఫంక్‌వాల్
తాటిచెట్లపాలెం : ఉద్యోగులు, కార్మికులే భారతీయ రైల్వేకు బలమని ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్‌వాల్ తెలిపారు. సోమవారం తాటిచెట్లపాలెంలో గల ఆశీర్వాద్ కల్యాణ మండపంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ ఽ11వ ద్వివార్షిక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో నిత్య శ్రామికులు ఒక్క రైల్వే కార్మికులు మాత్రమేనని తెలిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ కార్మికుల పక్షాన పలు సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చిందని, త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు. వాల్తేర్ డివిజన్ డీఆర్‌ఎం లలిత్‌బోహ్ర మాట్లాడుతూ రైల్వే కార్మికులంతా కలిసి పనిచేస్తూ, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రతీ అడుగులోనూ కార్మికుల పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే(ఎన్‌ఎఫ్‌ఐఆర్) ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్రి రాఘవయ్య మాట్లాడుతూ కార్మికులు సరిగా పనిచేయకపోతే అధికారులు వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకంటారని, మరి యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఎటువంటి చర్యలు లేవని వాపోయారు. వెంటనే 8వ వేతన సంఘం ఏర్పాటుచేసి 2026 జనవరి నుంచి తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పాత పెన్షన్ స్కీమ్‌ను ప్రతీ రైల్వే కార్మికుడికి అమలుచేయాలని, పాత డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ముందుగా ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ జోనల్ ప్రెసిడెంట్ జి.సంపత్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఆర్.సి.సాహూలు కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. ముఖ్యంగా అపరిష్కృతంగా ఉన్న రన్నింగ్ స్టాఫ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే పీసీపీవో ఎల్‌విఎస్‌ఎస్ పాత్రుడు, సీనియర్ డీపీవో జూసుఫ్ కబీర్ అన్సారి, ఏడీఆర్‌ఎంలు మనోజ్‌కుమార్ సాహూ, ఈ.శాంతరాం, సీనియర్ డీఎంఈ, సీనియర్ డీఎస్‌టీఈ, ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్, వాల్తేర్ డివిజన్, డివిజనల్ కో ఆర్డినేటర్ టి.వి.మౌళీశ్వర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ టి.నరసింగరావు, వాల్తేర్, ఖుర్దారోడ్, సంబల్‌పూర్ డివిజన్ల నుంచి అధిక సంఖ్యలో ఉద్యోగులు, కేంద్ర కార్యవర్గ సభ్యులు, బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

కార్మికులే రైల్వేకు బలం