
పిడుగుపాటుకు శాప్ కార్మికుడు దుర్మరణం
పీఎం పాలెం: కొమ్మాదిలో గల శాప్(ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్)లో పనిచేస్తున్న దోహార్తి సూర్యప్రకాష్(38) పిడుగుపాటుకు గురై మరణించాడు. సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఈ దుర్ఘటనకు సంబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాలు.. సూర్యప్రకాష్ ఆరిలోవలో భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తూ కొమ్మాది ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆఫీస్ సబార్డినేట్, గ్రౌండ్ మెయింటెనెన్స్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 9 గంటలకు గ్రౌండ్‌కు వెళ్లిన అతడు మెషీన్‌తో గ్రాస్ కట్ చేస్తుండగా 11.10 సమయంలో పెద్ద శబ్దంతో పిడుగు పడింది. ఆ ధాటికి సూర్యప్రకాష్ గ్రౌండ్‌లో పడిపోయాడు. శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. అక్కడ ఉన్నవారు 108 వాహనానికి ఫోన్ చేశారు. వారు వచ్చి పరిశీలించి మరణించినట్లు ఽఽఽధ్రువీకరించారు. మృతుని భార్యకు, పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. భార్య ఆశ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.