
దేశ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి
మద్దిలపాలెం: విద్యార్థులు విభిన్న రంగాల్లో ప్రతిభ సాధించాలని ఏయూ జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్) సమన్వయకర్త ఆచార్య డి.సింహాచలం అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏయూ ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల యువజనోత్సవాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని తద్వారా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయాలని సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు విద్యతో సమానంగా కళలు, సాంస్కృతిక, సాహస కృత్యాల్లో చురుకై న భూమిక పోషిస్తారని పేర్కొన్నారు. విద్యార్థి వ్యవహారాల విభాగం డీన్ ఆచార్య ఎస్.హరినాథ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రత్యేకమైన నైపుణ్యాలను, సామర్థ్యాలను కలిగి ఉంటారని, వాటిని గుర్తించి ఆ దిశగా కృషి చేయాలన్నారు.
రెండు రోజులపాటు 11 అంశాలలో యువజనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తొలి రోజు వక్తృత్వ, వ్యాసరచన, వాద ప్రతివాద, క్విజ్, రంగవల్లులు, చిత్రలేఖనం విభాగాల్లో పోటీలు జరిగాయి. మంగళవారం సోలో, గ్రూప్ సాంగ్‌లు, శాసీ్త్రయ, జానపద నృత్యాలు, నాటికల విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవమైన సెప్టెంబర్ 24న బహుమతులు అందించనున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రొగ్రాం అధికారి ఈపీఎస్ భాగ్యలక్ష్మి, జోనల్ అధికారి డాక్టర్ పి.ఉమామహేశ్వరరావు, వివిధ జిల్లాల ప్రొగ్రాం అధికారులు పాల్గొన్నారు.
ఏయూ ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో
యువజనోత్సవాలు