
కేజీహెచ్‌లో కమీషన్ల చిచ్చు
రూ.7 కోట్ల కొనుగోళ్లలో రూ.42 లక్షల కమీషన్ సొమ్ము పంపకాల్లో తేడాతో అధికారుల్లో విభేదాలు మరోసారి వార్తల్లో నిలిచిన ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి
మహారాణిపేట: ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆసుపత్రిలో ఉన్నతాధికారుల మధ్య కమీషన్ల పంపకాల విషయంలో తలెత్తిన విభేదాలు, కుమ్ములాటలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటు కేజీహెచ్‌లో.. అటు వైద్య ఆరోగ్య శాఖలో పంపకాల బాగోతం హాట్‌టాఫిక్‌గా మారింది. ఇటీవల ఆసుపత్రిలో ఆక్సిజన్, సర్జికల్ పరికరాలు, మందుల కొనుగోలు కోసం సుమారు రూ. 7 కోట్లు వెచ్చించారు. ఈ కొనుగోళ్లకు సంబంధించి దాదాపు రూ.42 లక్షలు కమీషన్‌గా చేతులు మారినట్లు సమాచారం. అయితే, ఈ కమీషన్ డబ్బు పంపకాల్లో తేడాలు రావడంతో పరిపాలన విభాగాల్లోని అధికారుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. వాటాల విషయంలో తలెత్తిన వివాదం ఎంతగా ముదిరిందంటే, ఒక అధికారి చాంబర్‌లో చెక్కులు, కాగితాలు విసిరికొట్టే స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. వివిధ విభాగాల గుమస్తాలు, అధికారుల నుంచి ఉన్నత స్థాయి వరకు పంపకాలు జరిగాయని సమాచారం. కేవలం ఈ ఒక్క సంఘటనే కాదు.. కేజీహెచ్‌లో అవినీతి వ్యవస్థీకృతంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమ్యామ్యాల ముట్టజెప్పకపోతే కొనుగోళ్లు, టెండర్లు, ఇతర పనులకు సంబంధించిన ఫైళ్లు ముందుకు కదలవని, వాటిని ఏదో ఒక మూలన పడేస్తున్నారని సిబ్బందే గుసగుసలాడుకుంటున్నారు. ప్రతి పనికి డబ్బులు లంచంగా ఇవ్వనిదే జరగని పరిస్థితి నెలకొందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ కమీషన్ల బాగోతం బయటకు పొక్కడంతో.. నీ వల్లే బయటపడింది అంటూ అధికారులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నట్లు సమాచారం. కేజీహెచ్‌లో ఈ అవినీతి జాడ్యం ముదరకముందే కలెక్టర్ జోక్యం చేసుకుని, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.