
ఏయూ అంతర్ కళాశాలల క్రీడా పోటీలు ప్రారంభం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా ఏయూ అంతర్ కళాశాల క్రీడా పోటీల్లో భాగంగా పురుషుల కబడ్డీ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఏయూ ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఏయూ జిమ్నాజియం కబడ్డీ మ్యాట్‌పై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ గుర్తింపు పొందిన కళాశాలల కబడ్డీ క్రీడాకారులు పాల్గొనడంపై అభినందనలు తెలిపారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా క్రికెట్, కబడ్డీ, ఖోఖో పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో ఏయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏయూలోని క్రీడా మైదానాలను సింథటిక్ మైదానాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని సూచించారు. అలాగే, ఈ సంవత్సరం నుంచి ఇంటర్ కాలేజియేట్ క్రీడల్లో పాల్గొనే వారికి భోజన సదుపాయంతో పాటు, ఇతర యూనివర్సిటీలకు వెళ్లే క్రీడాకారుల డీఏను పెంచినట్లు వివరించారు. ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ మాట్లాడుతూ వివిధ జిల్లాలకు చెందిన అనుబంధ కళాశాలల నుంచి 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఇందులో సుమారు 35 జట్లు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏయూ వ్యాయామ విద్యా విభాగం హెడ్ ఆచార్య ఎ. పల్లవి, ఐఐపీఈ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ జి. వెంకటేశ్వరరావు, పలు కళాశాలల పీడీలు పాల్గొన్నారు.
కబడ్డీ పోటీల ఫలితాలు
● చింతపల్లి డిగ్రీ కళాశాల, సాంకేతిక కళాశాల మధ్య జరిగిన మ్యాచ్‌లో సాంకేతిక కళాశాల 15 పాయింట్లతో గెలిచింది.
● గరివిడి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, నర్సీపట్నానికి జరిగిన మరో మ్యాచ్‌లో గరివిడి 7 పాయింట్ల ఆధిక్యంతో గెలిచింది.
● ఏవీఎన్ కళాశాల, వాగ్దేవి కళాశాల మధ్య జరిగిన మ్యాచ్‌లో వాగ్దేవి 3 పాయింట్ల ఆధిక్యంతో నిలిచింది.
● జీడీసీ పాడేరు, జీడీసీ తగరపువలస మధ్య జరిగిన మ్యాచ్‌లో జీడీసీ పాడేరు 16 పాయింట్లతో విజయం సాధించింది.
● స్పెష్ డిగ్రీ కళాశాల, జీడీసీ సబ్బవరం మధ్య జరిగిన మ్యాచ్‌లో సబ్బవరం 15 పాయింట్లతో గెలిచింది.
● ఎంవీఆర్ డిగ్రీ కాలేజ్, ఆదిత్య మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎంవీఆర్ 9 పాయింట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచింది.