
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే రణభేరి
తగరపువలస: ప్రభుత్వ పాఠశాలల రక్షణ, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే రణభేరి బైక్‌జాతా నిర్వహిస్తున్నట్టు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కిషోర్ కుమార్, కోశాధికారి రెడ్డి మోహనరావు అన్నారు. ఆనందపురంలో రణభేరి కార్యక్రమాన్ని శుక్రవారం డప్పు మోగించడం ద్వారా వీరు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కేంద్రాలలో రణభేరి ప్రచారజాతా జరుగుతుందన్నారు. అనంతరం వీరు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న సాల్ట్ పథకాన్ని విమర్శించారు. దీనివలన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నాణ్యత, ఎన్‌రోల్‌మెంట్ పెరగకపోగా తగ్గుదల కనిపిస్తోందన్నారు. దీనికి ఉపాధ్యాయులు సరిగా బోధన చేయడం లేదని సాకుగా చూపడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. యాప్‌లతోనే పాఠశాల సమయం హరించుకుపోతోందని, పిల్లలకు నాణ్యమైన విద్య అందించే అవకాశం లేకుండా పోతుందని అన్నారు. 2023 జూలై నుంచి రావలసిన 12వ పీఆర్సీ 25 నెలలు గడిచినా ఇవ్వలేదన్నారు. సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ ఇవ్వలేదన్నారు. తప్పనిసరి పరిస్థితిలో నిర్వహిస్తున్న ఈ రణభేరి ఈ నెల 25న గుంటూరులో ముగుస్తుందన్నారు. నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కిషోర్, శ్రీలక్ష్మి, పూర్వ రాష్ట్ర సహధ్యక్షురాలు కోరెడ్ల విజయగౌరి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాసరి నాగేశ్వరరావు, టీఆర్ అంబేడ్కర్, ఎన్.ప్రభాకర్, ఎ.పైడిరాజు, విజయకుమారి, రాంబాబు, సత్యం తదితరులు పాల్గొన్నారు.