
జోధ్‌పూర్‌లో జీవీఎంసీ బృందం
ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక చర్చ
డాబాగార్డెన్స్: అధ్యయన యాత్రలో భాగంగా జీవీఎంసీ కార్పొరేటర్ల బృందం శుక్రవారం జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించింది. మేయర్ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, అధికారుల బృందం.. జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ సౌత్ మేయర్ వనితా సేథ్, కమిషనర్ సిద్ధార్థ పళనిచామితో కలిసి సమావేశమైనట్లు జీవీఎంసీ కార్యదర్శి బీవీ రమణ తెలిపారు. ఈ సందర్భంగా జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న అభివృద్ధి పనులపై, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్యం, తాగునీటి వనరుల సద్వినియోగం, పచ్చదనం అభివృద్ధి వంటి అంశాలపైనా చర్చ జరిగింది. ఈ వివరాలను జోధ్‌పూర్ మేయర్ బృందం వివరించింది. అలాగే విశాఖ నగరాభివృద్ధి, ఆదాయ వనరులు, రోడ్లు, రవాణా, జంక్షన్లు, పార్కుల అభివృద్ధి, నీటి శుద్ధి కర్మాగారాలు, డ్రైనేజీ, మురుగునీటి వ్యవస్థ, వీధి దీపాలు, ఉద్యానవనాలు, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించినట్లు కార్యదర్శి రమణ తెలిపారు. అనంతరం జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ విశాఖ కార్పొరేటర్లకు జ్ఞాపికలు అందజేసి, సత్కరించింది.