
‘ఇరిగేషన్’లో ఇన్‌చార్జ్‌ల పాలన
మహారాణిపేట: ఉత్తరాంధ్రలో కీలకమైన జలవనరుల శాఖపై కూటమి సర్కార్ అడుగడుగునా నిర్లక్ష్యం వహిస్తోంది. సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్‌ఈ) పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఉన్న ఐదు ఎస్‌ఈ పోస్టుల్లో వంశధార ప్రాజెక్ట్ ఎస్‌ఈ ఒక్కరే రెగ్యులర్. ఎస్‌ఈలు రిటైర్ అయినా ఇన్‌చార్జ్ బాధ్యతలు ఎక్కడో పనిచేస్తున్న వారికి అప్పగిస్తున్నారు. దీంతో పర్యవేక్షణ పూర్తిగా కొరవడుతోంది.
ధవళేశ్వరం నుంచి.. : విశాఖ ఎస్‌ఈ పోస్టులో ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్‌ఈని ఇన్‌చార్జ్‌గా నియమించారు. విస్తారంగా వర్షాలతో రిజర్వాయర్లు పొంగి ప్రవహిస్తున్న సమయంలో ఆయన ఇక్కడికి రాలేక, అక్కడే ఉండలేక తిప్పలు పడే పరిస్థితి. కీలకమైన విశాఖలో అనేక రిజర్వాయర్లలో నీరుచేరి గేట్లు ఎత్తడంలో అనుమతులు రాక ఏఈలు, డీఈఈ తీవ్ర ఇబ్బందులుపడ్డారు.
ఈఈలు, డీఈఈలూ ఇన్‌చార్జిలే! : ఉమ్మడి ఉత్తరాంధ్రలో కీలకమైన నార్త్ కోస్టు సీఈ పోస్టు కూడా ఇన్‌చార్జితోనే నడుస్తోంది. ఉమ్మడి విశాఖలోని నాలుగు డివిజ్లలో మూడింట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(ఈఈ) కరవయ్యారు. దాదాపు అన్ని ఎస్‌ఈ, ఈఈ పోస్టులు ఇన్‌చార్జిలతోనే నడుస్తున్నాయి. ఇన్‌చార్జిలు రెండు/మూడు పడవల ప్రయాణం చేయలేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో దాదాపు అన్ని డివిజన్లలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(డీఈఈ), అసిస్టెంట్ ఇంజినీర్ల(ఏఈ)తోనే నెట్టుకొస్తున్నారు. ఈ పోస్టుల్లో కూడా చాలా వరకు ఇన్‌చార్జిలే ఉండటం గమనార్హం.
పదోన్నతులు, పోస్టింగుల్లోనూ అన్యాయం : జలవనరుల శాఖలో ఇటీవల ఇచ్చిన పదోన్నతులు, పోస్టింగుల్లో కూడా ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. ఉమ్మడి ఉత్తరాంధ్రలోని అన్ని ఎస్‌ఈలు, ఈఈ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంటున్నాయి. విశాఖ ఎస్‌ఈ పోస్టుకు ఇన్‌చార్జిగా ధవళేశ్వరం నుంచి వేశారంటే.. ఇక్కడి సిబ్బందిపై ప్రభుత్వానికి ఎంత చిన్నచూపు ఉందో.. తేటతెల్లమవుతోంది.