
కూటమి పాలనలో పేదలకు వైద్యం దూరం
చలో మెడికల్ కాలేజ్ విజయవంతానికి పిలుపు పాడేరు మెడికల్ కళాశాల వద్ద శాంతియుత నిరసన రేపు వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉత్తరాంధ్ర జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్
మహారాణిపేట: రాష్ట్ర ప్రజల ఆరోగ్య హక్కులను కాపాడటమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉత్తరాంధ్ర జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్ అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటుతో పేదోడికి వైద్య విద్యను చేరువ చేసేందుకు కృషి చేశారని కొనియాడారు. 2019 వరకు రాష్ట్రంలో కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉండగా, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2023 సెప్టెంబర్ 15న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రారంభించి, ప్రజారోగ్య పరిరక్షణ లో కొత్త దశకు వైఎస్ జగన్ నాంది పలికారన్నారు. ఈ ఐదు కాలేజీల్లో 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా.. పాడేరు, పులివెందుల కాలేజీలను కూడా అడ్మిషన్లకు సిద్ధం చేశారని పేర్కొన్నారు. ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు అప్పగించే ప్రయత్నం చేయడం అత్యంత దారుణమన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో పేదోడికి వైద్యం మరింత ఖరీదుగా మారిందన్నారు. ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ.2,500 కోట్ల పెండింగ్‌తో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మెబాట పడుతున్నాయని పేర్కొన్నారు.
రేపు ‘చలో మెడికల్ కాలేజ్’
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. యువజన, విద్యార్ధి విభాగాల ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజ్ పేరిట నిరసన తెలపనున్నట్లు వెల్లడించారు. విశాఖ జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, అన్ని అనుబంధ విభాగాల నాయకులను కలిసి 19న పాడేరులోని మెడికల్ కళాశాల వద్ద శాంతియుతంగా నిరసన తెలపనున్నట్లు పేర్కొన్నారు.
సమావేశంలో రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కనకల ఈశ్వరరావు, జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు జాడ శ్రావణ్‌కుమార్, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు కాగితాల రవికిరణ్, తాడి రవితేజ, మువ్వల సంతోష్ కుమార్, యువజన విభాగం నాయకులు బొట్ట రాజు, ప్రేమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.