
డివైడర్‌ను ఢీకొన్న కారు
● నలుగురికి గాయాలు
మల్కాపురం: సేవా మార్గంలో ఒక కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాలివి. శుక్రవారం ఉదయం నగరానికి చెందిన రాజు, వెంకట శ్రీదేవి, మహాలక్ష్మి, శ్వేత లక్ష్మి, వెంకటలక్ష్మి కారులో అచ్యుతాపురం వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి షీలానగర్ నుంచి కాన్వెంట్ జంక్షన్ వైపు వస్తున్నారు. మారుతి సర్కిల్ వద్ద వంతెన పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కోసం రోడ్డుపై ఉంచిన సిమెంట్ దిమ్మలను గమనించకుండా కారు నడుపుతున్న వ్యక్తి వాటిని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న మల్కాపురం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వస్తున్న 60వ వార్డు కార్పొరేటర్ పి.వి.సురేష్.. గాయపడిన వారిని గుర్తించి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, మానవత్వం చాటుకున్నారు.