
కళాభారతిలో నృత్య వైభవం
మద్దిలపాలెం: కళాభారతి వేదికపై 17వ వైశాఖి జాతీయ నృత్యోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవానికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఐసీసీఆర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయి. ముందుగా విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి సుదగాని రవిశంకర్ నారాయణ్, జీఎస్టీ అడిషనల్ డైరెక్టర్ ఎన్. మహమ్మద్ అలీ, కళాభారతి కార్యదర్శి జి.వి.ఆర్.కె. ప్రసాద్ ముఖ్యఅతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
అలరించిన నృత్య ప్రదర్శనలు
తొలిరోజు ప్రదర్శనల్లో భాగంగా కేరళకు చెందిన కూచిపూడి కళాకారిణి డా.పద్మిని క్రిష్ణన్ మరకత మణిమయ చేల అనే ఉత్తుకాడు వెంకట కవి కృతితో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. న్యూఢిల్లీకి చెందిన ఒడిస్సీ నృత్యకారిణి విద్యూషి కవిత ద్వివేది బృందం పంచాక్షర స్తోత్రం, ఓం నమఃశివాయ, శుద్ధ నృత్యం, గీతగోవిందంలోని అష్టపది, విష్ణు అవతారాలు వంటి ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తెలంగాణకు చెందిన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీత ఒగ్గు రవికుమార్ బృందం ప్రదర్శించిన ఒగ్గు డోలు విన్యాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మల్లన్న, బీరప్ప కథలతో కూడిన వారి ప్రదర్శన ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
పురస్కారాల ప్రదానం
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన కళాకారులను ప్రతిష్టాత్మక పురస్కారాలతో సత్కరించారు. అనుపమ మోహన్ (కూచిపూడి, కేరళ)కు పద్మభూషణ్ గురు డా. సరోజా వైద్యనాథన్ ఎక్స్‌లెన్స్ అవార్డు, డా. కె.ఆముక్తమాల్యదకు పద్మభూషణ్ గురు డా. సరోజా వైద్యనాథన్ యువ పురస్కార్ 2025, డా. పద్మిని క్రిష్ణన్ (కూచిపూడి, కేరళ)కు వైశాఖీ ఎక్స్‌లెన్స్ అవార్డు 2025, కవిత ద్వివేది(ఒడిస్సీ, న్యూఢిల్లీ)కి నాట్యశ్రీ అవార్డు 2025, ఒగ్గు రవికుమార్ (ఒగ్గు డోలు, తెలంగాణ)కు పద్మభూషణ్ గురు డా. సరోజా వైద్యనాథన్ యువ పురస్కార్ 2025లను ప్రదానం చేశారు. భారతీయ నృత్య సంప్రదాయాలను పరిరక్షిస్తూ, యువ కళాకారులను ప్రోత్సహించడానికి వైశాఖీ నృత్యోత్సవం ఒక గొప్ప వేదికగా నిలుస్తోందని వక్తలు ప్రశంసించారు. నిర్వాహకులు బత్తిన విక్రమ్ గౌడ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఘనంగా వైశాఖి జాతీయ
నృత్యోత్సవం ప్రారంభం

కళాభారతిలో నృత్య వైభవం