
బైక్ ఇవ్వలేదని తండ్రితో గొడవ
రైలు కింద పడి యువకుడి బలవన్మరణం
గోపాలపట్నం: బైక్ ఇవ్వలేదని తండ్రితో గొడవ పడి రైలు కింద తలపెట్టి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రానగర్ వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాలివి. జీవీఎంసీ 89వ వార్డు చంద్రానగర్‌కు చెందిన కరణం తేజ(21) వడ్రంగి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. తేజకు మద్యం సేవించే అలవాటు ఉంది. జులాయిగా తిరుగుతుంటాడు. అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు. శుక్రవారం ఉదయం తండ్రి కృష్ణకు బైక్ కావాలని అడిగాడు. అందుకు ఆయన వద్దన్నాడు. అతని తమ్ముడు ఆ బైక్‌ను తీసుకుని పనికి వెళ్లాడు. తేజ తమ్ముడి వద్ద నుంచి బైక్ తీసుకుని బయటకు వెళ్లగా.. ఆ విషయం తండ్రికి తెలిసింది. దీంతో ఆయన తేజ వద్ద నుంచి బైక్ తీసుకున్నాడు. ఈ విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. తనకు బైక్ ఇవ్వలేదని తీవ్ర మనస్తాపంతో తేజ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.