
గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు
విశాఖ సిటీ: గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఎస్పీలను ఆదేశించారు. శుక్రవారం రేంజ్ పరిధిలోని అల్లూరి, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలతో డీఐజీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గంజాయి నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, వివిధ నేరాల నిరోధక చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు చేశారు. అక్రమ గంజాయి రవాణా వ్యాపారంలో పాల్గొన్న 14 మంది నేరస్తుల ఆస్తులు రూ.10,04,89,621 స్వాధీనం చేసుకోవడాన్ని అభినందించారు. ఇప్పటి వరకు 1,119 మంది గంజాయి నేరస్తుల కదలికలపై షీట్లు తెరిచినట్లు చెప్పారు. అలాగే 51 మంది నిందితులపై పీడీ చట్టం, 80 మందిపై పీఐటీ ఎన్‌డీపీఎస్ చట్టం అమలుకు ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడించారు. తరచూ గంజాయి రవాణా చేసే 368 మంది, అలాగే గంజాయితో పాటు ఇతర నేరాలలో పాల్గొన్న 370 మందిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. న్యాయస్థానాలు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్లు ఆధారంగా 341 మందిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 20 కేసుల్లో 33 మంది నిందితులకు శిక్షలు పడ్డాయన్నారు. వీరిలో 24 మందికి 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్షలు ఖరారయ్యాయన్నారు. విశాఖపట్నం రేంజ్ పోలీసులు స్టే సేఫ్, నిదాన్, కాజ్, నాట్ గ్రిడ్ యాప్స్ ద్వారా పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడంలో కృషిని అభినందించారు. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాలు, మహి ళ మిస్సింగ్ కేసులపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని చెప్పారు. రేంజ్ పరిధిలోని శాంతి భద్రతల సమస్యలపై చర్చించారు.
డీఐజీ గోపీనాథ్ జెట్టి