
అప్పన్న రికార్డులు, ఆభరణాల పరిశీలన
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంతోపాటు, స్వామివారి ఉపాలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి వస్తువుల తనిఖీ, రికార్డుల పరిశీలన కొనసాగుతోందని దేవస్థానం డిప్యూటీ ఈవో, బంగారం, వెండి కస్టోడియన్ సింగం రాధ తెలిపారు. శనివారంతో తనిఖీలు ముగిసే అవకాశం ఉందని, నివేదికను దేవదాయశాఖ రాజమహేంద్రవరం ఆర్‌జేసీకి త్వరలో కమిటీ సమర్పించనుందన్నారు. కొన్ని రోజులుగా జరుగుతున్న బంగారం, వెండి ఆభరణాల తనిఖీ, రికార్డుల పరిశీలన వివరాలను శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. స్వామివారి బంగారం, వెండి ఆభరణాలకు సంబంధించిన రికార్డులు, తూకాల్లో అవకతవకలు జరిగాయంటూ ప్రభాకరాచారి అనే వ్యక్తి గత ఏడాది చేసిన ఫిర్యాదు మేరకు దేవదాయ శాఖ కమిషనర్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరి 17 నుంచి 21, 25 నుంచి 27, ఫిబ్రవరి 11 నుంచి 13, 18 నుంచి 24 వరకు జ్యుయలరీ వెరిఫికేషన్ అధికారి తనిఖీలు నిర్వహించి ప్రాథమిక నివేదికను ఆర్జేసీకి అందించారన్నారు. తుది నివేదిక కోసం 5గురు సభ్యులతో మళ్లీ కమిటీ ఏర్పాటు చేయడంతో ఆ కమిటీ ఆగస్టు 9 నుంచి 20 నుంచి వరకు తనిఖీలు చేసిందన్నారు. మళ్లీ రెండు రోజుల నుంచి బ్యాంకుల్లోను, అర్చకుల ఆధీనంలో ఉన్న వస్తువులను తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తుది నివేదికను రెండు రోజుల్లో ఆర్‌జేసీకి సమర్పించే అవకాశం ఉందన్నారు. కమిటీ నిర్ధారించిన ఆభరణాల వివరాలను త్వరలో పత్రికాముఖంగా వెల్లడిస్తామన్నారు.