
అంగట్లో ఆశ పోస్టులు
వైద్య ఆరోగ్య శాఖలో 68 పోస్టులకు దరఖాస్తులు పోస్టుల కోసం పెద్ద ఎత్తున పైరవీలు ఒక్కో పోస్టుకు రూ.3 లక్షలు డిమాండ్? కొంతమందికి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సిఫార్సు లేఖలు
మహారాణిపేట : ఆశ వర్కర్ల పోస్టులకు ధర భారీగా పలుకుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పోస్టులకు డిమాండ్ పెరిగింది. ఇటు కూటమి నాయకులు, అటు కార్పొరేటర్లు పైరవీలను ముమ్మరం చేశారు. మరోవైపు ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు రావడం, వాటిని ఆసరాగా తీసుకొని వైద్య ఆరోగ్యశాఖలో కొంతమంది సిబ్బంది తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీలో డీఎంహెచ్‌వో మీద ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. డీఎంహెచ్‌వోకి ఒక వైపు సిఫార్సులు లేఖలు, మరో వైపు ఎమ్మెల్యే పీఏల నుంచి ఫోన్లు వస్తున్నాయి.
68 పోస్టులకు 6వేలకు పైగా దరఖాస్తులు
విశాఖ జిల్లాలో 68 ఆశ వర్కర్ల పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. ఆరు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ పోస్టులకు భారీగా పోటీ నెలకొంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. మెరిట్‌తోపాటు రోస్టర్ ప్రకారం పోస్టులను భర్తీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఈనెల 15వ తేదీలోగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపట్టారు.
కూటమి నేతల బేరసారాలు : ఆశ వర్కర్ల పోస్టుల కోసం కొంత మంది కూటమి నేతలు బేరసారాలకు దిగారు. అభ్యర్థులు స్థానిక నేతలను కలవగా వారు బేరం పెట్టేశారు. ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతమంది కోసం స్థానిక కార్పొరేటర్లు సిఫార్సు చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు ఎమ్మెల్యేను కలిసి సిఫార్సు లేఖలను తీసుకొని నేరుగా డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఇస్తున్నట్లు సమాచారం. అయితే సిఫార్సు లేఖ ఇచ్చిన ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది బేరాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల నుంచి సిఫార్సు లేఖలు రావడంతోపాటు డబ్బులు వసూలు చేస్తుండడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కింద స్థాయి పోస్టులను కూడా ఎమ్మెల్యేల కార్యాలయం నుంచి బేరసారాలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మరోవైపు సిఫార్సు లేఖలతో వచ్చిన అభ్యర్థులతో వైద్య ఆరోగ్యశాఖలో కొంతమంది సిబ్బంది.. ఉద్యోగం వచ్చిన తరువాత డబ్బులు ఇవ్వండని మాట్లాడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.