
కేజీహెచ్ వార్డు బాయ్ సస్పెన్షన్
మహారాణిపేట: ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కేజీహెచ్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వైద్యురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై రోజుల తరబడి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన అధికారులు.. ‘కేజీహెచ్‌లో కీచకులు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ఉలిక్కిపడి.. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వార్డు బాయ్ శంకరరావును సస్పెండ్ చేస్తూ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 26న గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డులో మహిళా వైద్యురాలి పట్ల వార్డు బాయ్ శంకరరావు రెండుసార్లు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె అదే రోజు కేజీహెచ్ సూపరింటెండెంట్, ఏఎంసీ ప్రిన్సిపాల్, విభాగాధిపతులతో పాటు వన్‌టౌన్ పోలీసులకు సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ విషయంపై ‘సాక్షి’దినపత్రికలో కథనం వెలువడింది. దీంతో కేజీహెచ్ యాజమాన్యం తర్జనభర్జనల అనంతరం చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. వెంటనే సంబంధిత ఫైల్‌ను తయారు చేసి, శంకరరావును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై నాల్గవ తరగతి ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు త్వరలో సమావేశం కానున్నట్లు తెలిసింది. కాగా.. సర్జరీ విభాగంలో బాలిక తల్లి పట్ల ఓ వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదుపై కూడా ఆస్పత్రి ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ నుంచి కేజీహెచ్‌కు వచ్చిన రెండు ఈ–మెయిల్స్‌ను ఎవరు డిలీట్ చేశారన్న దానిపై కూడా అంతర్గత విచారణ మొదలైనట్లు సమాచారం.