
విశాఖ అభివృద్ధికి బృహత్ ప్రణాళిక
డాబాగార్డెన్స్: విశాఖ నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఆపరేషన్ లంగ్స్ కింద ప్రభుత్వ స్థలాలు గుర్తించామని, వాటిలో పార్కులు అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. వార్డుకి ఒకటి చొప్పున వెండింగ్ జోన్స్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే 76 వార్డుల్లో స్థలాలను గుర్తించామని, గుర్తింపు కార్డులు త్వరలో జారీ చేస్తామన్నారు. బుధవారం తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన నగరాభివృద్ధికి సంబంధించిన పలు ప్రణాళికలను వివరించారు.
రోడ్ల విస్తరణే ప్రధాన ఎజెండా
‘జీవీఎంసీ పరిధిలో 114 ప్రధాన రహదారులను అభివృద్ధి చేయనున్నాం. ప్రతి వార్డులో ఒక ప్రధాన రహదారితో పాటు, ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన మరో 14 రోడ్లను విస్తరించనున్నాం. భూ సమీకరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జోనల్ కమిషనర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, వీఆర్వోలతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. నగరంలో సీసీ, బీటీ రోడ్ల అభివృద్ధికి రూ.250 కోట్లు కేటాయించగా, కొన్ని పనులు పూర్తయ్యాయి. మరికొన్ని టెండర్ల దశలో ఉన్నాయి.’ అని కమిషనర్ వివరించారు. చంద్రంపాలెం వద్ద ఫుట్‌ఓవర్ బ్రిడ్జికి జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు.
మురుగునీరు శుద్ధి
అప్పుఘర్ నుంచి భీమిలి వరకు 13 డ్రెయిన్లను అనుసంధానిస్తూ.. అప్పుఘర్, సాగర్‌నగర్, భీమిలిలో మూడు సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు(ఎస్‌టీపీలు) నిర్మిస్తామని కమిషనర్ తెలిపారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని నరవకు తరలించి, అక్కడి నుంచి పరిశ్రమలకు సరఫరా చేస్తామన్నారు. ఆపరేషన్ లంగ్స్‌లో భాగంగా నగరంలో గుర్తించిన 1,480 బహిరంగ స్థలాల్లో.. 385 స్థలాలను ఇప్పటికే పార్కులుగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. మిగిలిన స్థలాలకు ఫెన్సింగ్ వేసి, ఆక్రమణల నుంచి కాపాడామని కమిషనర్ స్పష్టం చేశారు.
భవన నిర్మాణాలపై కఠిన వైఖరి
సర్వే సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఈ నెల 30 నాటికి ఆన్‌లైన్ పోర్టల్ తీసుకువస్తున్నట్లు కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. సర్వే చేయించుకోవాలనుకునే వారు ఇకపై ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భవన నిర్మాణాలు పూర్తయ్యాక, ప్లాన్‌కు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ నిరాకరించడంతో పాటు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫుడ్ స్టాళ్లు, హోటళ్లపై తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. గత నెలలో 191 హోటళ్లలో తనిఖీలు నిర్వహించి, నాణ్యతా ప్రమాణాలు పాటించని 170 హోటళ్ల యాజమాన్యాలకు రూ.2,71,900 జరిమానా విధించినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు.
ట్రాఫిక్ నియంత్రణకు నూతన వ్యవస్థ
‘నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఆటోమేటెడ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టంను త్వరలో ప్రవేశపెట్టనున్నాం. 14 ప్రధాన జంక్షన్లలో ఫ్రీ లెఫ్ట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించాం. సిగ్నలింగ్ వ్యవస్థను అనుసంధానించి, ఒక జంక్షన్ దాటిన వాహనాలకు తదుపరి జంక్షన్‌లో కూడా గ్రీన్ సిగ్నల్ పడేలా కొత్త విధానాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇటీవల జరిగిన గిరి ప్రదక్షిణ రోజున పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టాం. నగరంలో మొత్తం 115 జంక్షన్లు ఉండగా.. పోలీసుల సహకారంతో తొలి దశలో 50 జంక్షన్లలో దీనిని అమలు చేయనున్నాం’అని కమిషన్ వివరించారు.
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్