
ఆదుకోవాలని ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల ర్యాలీ
బీచ్‌రోడ్డు: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సులు అందుబాటులోకి రావడం వల్ల తమ ఆదాయం 80 శాతం తగ్గిందని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ రెహ్మాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్.కాసుబాబు తెలిపారు. ఇంటి అవసరాలు, పిల్లల స్కూలు ఫీజులు, కరెంటు చార్జీలు, అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జీవీఎంసీ గాంధీ పార్కు నుంచి గురజాడ అప్పారావు బొమ్మ మీదుగా తిరిగి గాంధీ బొమ్మ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నంబర్ 21, 31 వల్ల భారీగా జరిమానాలు విధిస్తున్నారని, దీనికి తోడు సీ్త్ర శక్తి పథకం తమను ఆర్థికంగా దెబ్బతీసిందన్నారు. ఆదాయం లేక వాహనాలకు ఫైనాన్స్ సకాలంలో చెల్లించలేకపోతున్నామని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం ప్రతి నెలా రూ.5,000 తమ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ గ్యాస్‌పై 50 శాతం రాయితీ ఇవ్వాలని కోరారు. ఈ–చలాన్ కేసులను రద్దు చేయాలని, మోటార్ కార్మికుల భద్రత కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వాహనాలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, ప్రమాదంలో చనిపోయిన డ్రైవర్లకు రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సుమారు 60 వేల మంది ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఉన్నారని, వారి కుటుంబాలను ఆదుకునేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ర్యాలీలో ఫెడరేషన్ ప్రతినిధులు సాయికుమార్, నాగేశ్వరరావు, రాంబాబు, బుజ్జిబాబు, అప్పలరాజు, అన్నాజీ తదితరులు పాల్గొన్నారు.