
బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం
నరసాపురం జంక్షన్‌లో రోడ్డుపై ధర్నా
పద్మనాభం: మండలంలోని తునివలస పంచాయతీ నరసాపురం జంక్షన్‌లో బస్సులు ఆపకపోవడంతో ఆ గ్రామ ప్రజలు, కళాశాల విద్యార్థులు శుక్రవారం జంక్షన్‌లో రోడ్డుపై ధర్నా చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు వీరు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టినప్పటి నుంచి విజయనగరం నుంచి వచ్చేటప్పుడు నరసాపురం జంక్షన్‌లో బస్సులు అపకుండా రెడ్డిపల్లిలో నిలుపుతున్నారు. ఉచితంగా మహిళలు ఎక్కువగా బస్సులు ఎక్కుతున్నారని డైవర్లు బస్సులను నరసాపురంలో ఆపడం లేదు. రాత్రి వేళల్లోనూ బస్సులు నరసాపురం జంక్షన్‌లో ఆపకుండా రెడ్డిపల్లిలో నిలపడంతో సుమారు రెండు కిలోమీటర్ల దూరం చీకట్లో నడిచి రావాల్సి వస్తుండటంతో ప్రజలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. బస్సులకు అడ్డంగా రోడ్డు మీద వీరు నిలబడి పోయారు. సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. బస్సులు, ఆటోలు రోడ్డుపై నిలిచిపోయాయి. దీంతో డ్రైవర్లు, ప్రయాణికులు విద్యార్థులు, ప్రజలతో వాగ్వాదానికి దిగారు. చివరకు బస్సు డ్రైవర్లు నరసాపురంలో బస్సులో నిలుపుతామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం