
కమీషన్ల కక్కుర్తే కారణం
మహారాణిపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రంగాలను ప్రైవేటీకరిస్తోందని.. అదే విధంగా కమీషన్ల కోసమే రాష్ట్రంలో ఉన్న వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించేందుకు క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మండిపడ్డారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించాలని, పేదవాడికి అందని ద్రాక్షగా ఉన్న వైద్య విద్యను దగ్గర చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్రంలో సుమారు 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. కూట మి ప్రభుత్వం జగన్‌కి మంచి పేరు వస్తుందనే మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తుందని విమర్శించారు. 2019కి ముందు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 1045 వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తే వైఎస్సార్‌సీపీ పాలనలో 3,275 వ్యాధులకు దానిని విస్తరించిందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కేవలం 1,000 ఆస్పత్రుల్లో మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తే జగన్ ఆధ్వర్యంలో సుమారు 2,350 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం అందించినట్లు తెలిపారు. కరోనాకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం అందించినట్లు చెప్పారు. జగన్ 45 లక్షల మంది లబ్ధిదారులకు రూ.13 వేల కోట్లు వెచ్చించి వైద్యం, రూ. 1,500 కోట్ల ఆర్థిక ఆసరా అందించారన్నారు. బాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 5 లక్షల వరకు మాత్రమే లబ్ధి ఇచ్చేదని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ లబ్ధిని రూ. 25 లక్షలకు పెంచిందన్నారు. ఈ రోజు వైద్య విద్యను పేదలకు దూరం చేయాలనే దురుద్దేశంతోనే ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని భావించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కె.కె. రాజు స్పష్టం చేశారు.