
వికాస్ ద్వారానే..
వ్యవహారాలన్నీ
ఎమ్మెల్యే ఆదేశాలతో చక్కబెడుతున్న డాక్యుమెంట్ రైటర్
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ హల్‌చల్ రేవళ్లపాలెం భూకబ్జాలోనూ ఆయన హస్తమే వికాస్‌ను విచారిస్తే కూటమి ఎమ్మెల్యే పాత్ర బయటపడే అవకాశం గతంలోనూ అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్న ముఠా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
అక్రమంగా భూములను ఆక్రమించడం.. తప్పుడు రికార్డులను సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం.. వెనువెంటనే విక్రయించడంలో అందెవేసిన చేయిగా ఉన్న కూటమి ఎమ్మెల్యే వ్యవహారాలన్నీ డాక్యుమెంట్ రైటర్ ద్వారా నడుస్తున్నట్టు తెలుస్తోంది. వికాస్ అనే సదరు డాక్యుమెంట్ రైటర్ ద్వారానే తాజాగా మధురవాడ రేవళ్లపాలెంలోని సర్వే నెంబరు 203/14ఏ కు చెందిన భూ వ్యవహారాలను నడిపినట్టు స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే చెప్పారంటూ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సదరు డాక్యుమెంట్ రైటరే చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. ఒకవేళ పనికాకపోతే నేరుగా సదరు ఎమ్మెల్యే అధికారులకు ఫోన్ చేసి కూడా ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. దీంతో అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గి పనులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా లిటిగేషన్లు ఉన్న భూములకు సంబంధించిన సమాచారం సదరు డాక్యుమెంట్ రైటర్ ద్వారానే ఎమ్మెల్యే సేకరిస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో డాక్యుమెంట్ రైటర్ వికాస్‌ను విచారిస్తే కూటమి ఎమ్మెల్యే పాత్ర బయటపడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ దిశగా పోలీసులు విచారించడంలేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి.
గతంలోనూ ఇదే దందా...!
వాస్తవానికి రేవళ్లపాలెంలోని సర్వే నెంబరు 203/14ఏ కు చెందిన భూకబ్జా వ్యవహారంలో అరెస్టయిన బెవర అనిల్, వెంకటేష్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు గల ముఠా మొదటి నుంచీ ఇదే పద్ధతిలో అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాలను నడిపించేవారు. ఈ ముఠా గతంలోనూ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకోసం నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, ఎఫ్‌ఎంబీలను తమ వద్ద ఉంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ ముఠా ఇదే రేవళ్లపాలెంలోని సర్వే నెంబరు 201–11ఏ, 201–11బీలోని 1,522 చదరపు గజాల స్థలం కూడా తమకు వారసత్వంగా వచ్చిందంటూ నకిలీ రికార్డులను సృష్టించారు. దీనిని తమ కుటుంబ సభ్యులు ఐదుగురం సమానంగా విభజించుకుంటున్నామని రిజిస్ట్రేషన్ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా లెక్కిస్తేనే ఏకంగా రూ.5 కోట్ల వరకూ ఉంటుంది. ఇక మార్కెట్ ధరతో లెక్కిస్తే దీని విలువ రూ.10 కోట్లకుపైగానే ఉంటుంది. ఈ ఆస్తిని కూడా 2025 జనవరి 10వ తేదీన మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగింది. దీనిపై అసలు యజమాని ఫిర్యాదు చేయడంతో చివరకు ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు. ఇదే ముఠా గత మే నెలలో రేవళ్లపాలెంలోని సర్వే నెంబరు 203/14ఏలోని 1572.66 గజాలను ఏకంగా విక్రయించింది. ఈ రెండు వ్యవహారాల్లోనూ కూటమి ఎమ్మెల్యే పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారాలన్నీ సదరు డాక్యుమెంట్ రైటర్ వికాస్ ద్వారానే నడిపించినట్టు విమర్శలున్నాయి. అయితే సదరు డాక్యుమెంట్ రైటర్ జోలికి మాత్రం పోలీసులు వెళ్లకపోవడం పట్ల అనుమానాలు కలుగుతున్నాయి. అతడిని విచారిస్తే కూటమి ఎమ్మెల్యే పాత్ర బయటకు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ప్రైవేటు సర్వే ద్వారా..!
వాస్తవానికి ఫలానా ఆస్తి వీరిదే అనే వివరాలను రెవెన్యూ శాఖ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ముఠా సభ్యులు ఆస్తిని విక్రయించాల్సిన సందర్భంలో ప్రైవేటు సర్వే ఏజెన్సీ ద్వారా నివేదిక తీసుకుని సమర్పిస్తున్నారు. దీని ఆధారంగానే రిజిస్ట్రేషన్ వ్యవహారాలను నడిపిస్తున్నారు. మొన్న రేవళ్లపాలెంలో 202, 203/14ఏలోని 1566.72 గజాల స్థలం విక్రయంతో పాటు 2025 జనవరిలో రిజిస్ట్రేషన్ చేసి.. ఆ తర్వాత రద్దు చేసిన వ్యవహారంలోనూ (201–11ఏ, 11బీ) సర్వే నివేదిక ఇచ్చిన ఏజెన్సీ ఒక్కటే. శ్రీ ఆదిత్య జియో టెక్ అనే సంస్థ ద్వారా సర్వే నివేదిక సమర్పించి పనికానిచ్చుకోవడం గమనార్హం. ఇటువంటి ప్రైవేటు సర్వే ఏజెన్సీల పనితీరుపై కలెక్టర్, జేసీ దృష్టి సారించడంతో పాటు వీటి నివేదికలకు విలువ లేదనే విషయాన్ని కూడా అధికారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.